Janapadham_EPaper_TS_06-11-2024
ప్రమాదంలో రాజ్యాంగం
కుల వివక్ష అన్ని రంగాల్లో నాటుకొని ఉంది
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది
గణనతోనే అన్ని వర్గాలకు న్యాయం
తరాలుగా నష్టపోతున్న వారికి సమ ప్రాతినిధ్యం
కులగణనకు ప్రధాని భయపడుతున్నారు
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం
అగ్ర కులాలకు నిమ్న కులాలు కానరావు
కులగణన సంప్రదింపుల సమావేశంలో కాంగ్రెస్ లోక్ సభా పక్షనేత రాహుల్ గాంధీ
జనపదం, హైదరాబాద్ బ్యూరో
దేశంలో నెలకొన్న కులవివక్షతో భారత రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, రాజకీయాలు, చివరికి కార్పొరేట్ స్థాయిలోనూ ఇది బలంగా నాటుకుపోయి ఉందన్నారు. ఇది ప్రతిచోట ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ అనేది కనిపించదని చెప్పారు. ఏళ్ల నుంచి కొనసాగుతోన్న ఈ వివక్షను రూపుమాపాలంటే దేశంలో కులగణన ఒక్కటే మార్గమన్నారు. ఈ మహా కార్యాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి తాను ఇక్కడికి రాలేదన్న ఆయన ప్రస్తుత పరిణామాలతో దేశంలో ప్రతిచోట కుల వివక్ష ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించడంతో పాటు ఒప్పుకొని తీరాల్సిందేనన్నారు. అదే సమయంలో దాన్ని రూపుమాపేందుకు తమ వంతుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మొదలు ఏ స్థాయిలో ఉందో గుర్తించి దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయం ఇతర స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు దేశంలో కుల వివక్ష బయటికి రాకుండా కుట్రలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కుల వివక్ష గురించి ప్రధాని నోరు ఎందుకు మెదపడం లేదో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఏ ఏ రంగాల్లో ఏ ఏ కుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందో ప్రధానికి తెలుసుకోవాల్సిన అవసరం లేదా.? అని ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో కులగణన..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా తాను పార్లమెంటులో చెప్పానన్నారు. ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కూడా చెప్పానన్నారు. తాను కులవివక్ష, దేశంలో కులగణన గురించి ప్రస్తావన తెస్తే బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ.. నాపై దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాననే నిందలు మోపుతున్నారని ఆరోపించారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితి కుల వివక్ష గురించి మాట్లాడితే దేశాన్ని విడగొట్టడమా అని రాహుల్ ప్రశ్నించారు. కులగణన చేపట్టి దేశంలో ఎంత మంది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారో గుర్తిద్దామని కోరారు. వాస్తవమేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందన్నారు. దేశంలో కులాల వారీగా జనాభా లెక్క తెలిస్తేనే ఏ కులానికి ఏ మేరకు నిధులు, దేశ సంపద పంచాలో తెలుస్తుందన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక విషయాల్లో ప్రపంచంలోనే ఒకరైన మేధావిని ఇటీవల తాను కలిశాననీ, ఆ సమయంలో సమానత్వం గురించి చర్చలు జరిపానని రాహుల్ చెప్పారు. అందులో ప్రపంచంలోనే ఎక్కువ అసమానత్వం ఉన్న దేశం భారత్ అని సదరు విదేశీ మేధావి తనతో చెప్పారన్నారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ..
తెలంగాణలో కాంగ్రెస్ చేపడుతున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మంచి కార్యక్రమాన్ని చేపడుతోన్న పార్టీ నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడో ఓ చోట కూర్చొని బ్యూరోక్రాట్స్ చేసే గణన తమకు అవసరం లేదన్న ఆయన కులగణనలో ఎలాంటి ప్రశ్నలు పొందుపర్చాలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, ఓబీసీలు నిర్ణయించే విధంగా తెలంగాణలో కులగణన జరగడం హర్షనీయమన్నారు. దాంతో రాజకీయాల్లో అభివృద్ధి పరంగా ఎలా ముందుకు పోవాలో అర్ధమవుతుందన్నారు. తెలంగాణలో తాము చేస్తున్నది కులగణన మాత్రమే కాదనీ, రాబోయే రోజుల్లో, తరాల్లో సామాజికవర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలా ముందుకుపోవాలో నిర్ణయించేది ఈ గణనే అన్నారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని స్పష్టం చేశారు.
మా గుండె ధైర్యానికి నిదర్శనం
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో చేపడుతున్న కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వేను తమ ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం అవసరం అన్నారు. అది కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో సామాజిక బాధ్యత, అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారన్నారు. మాటలు కాకుండా చేతలతో చూపాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన అన్న సీఎం విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమన్న ఆయన ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు 9.8శాతం, ఈడబ్ల్యూఎస్ 8.8, ఓబీసీలు 57.11, ఎస్సీలు 15.3, ఎస్టీలు 8.8 శాతం మంది ఉన్నారన్నారు. ఇదే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మేధావులు పాల్గొన్నారు.