Rahul Gandhi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరి లాల్ శర్మ పోటీ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన విషయం విదితమే. అనూహ్యంగా ఆమె స్థానంలో రాహుల్ పేరును ఖరారు చేశారు. అమేథీ నుంచి రాహుల్ మళ్లీ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అది కూడా జరగలేదు. అమేథీ నుంచి కిశోరి లాల్ శర్మ బరిలో దిగుతున్నారు.
రాయ్‌బరేలీ, అమేథి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. దీంతో కాంగ్రెస్ కేడర్ కాస్త గందరగోళానికి గురైంది. ఎవరి పేర్లను ప్రకటిస్తారనే అయోమయం నెలకొని ఉండే. చివరకు తుది గడువుకు కొన్ని గంటల ముందు పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
అయితే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరిగింది. కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2004 నుంచి 2019 వరకు సోనియానే గెలుపొందారు. ఇటీవల సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథిలో 2004 నుంచి వరుసగా మూడుసార్లు రాహుల్ ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నాయకులు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు.