Loco Pilots Suspended | పరిమితికి మించి వేగంగా రైళ్లను వేగంగా నడిపి.. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేసిన ఇద్దరు లోకోపైలట్లపై రైల్వేశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోకోపైలట్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని అధికారులు నిర్దేశించారు. అయితే, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల ఈ వంతెనపై నుంచి దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది.
ఈ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, ఉత్తరప్రదేశ్‌లోని విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ల ప్రయాణిస్తుంది. ఈ రైలు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దేశ తొలి సెమీ హైస్పీడ్ రైలు ఇదే కావడం విశేషం. ఆ తర్వాత మాల్వా ఎక్స్‌ప్రెస్ సైతం పరిమితికి మించిన వేగంతో వెళ్లింది. ఈ రైలు జమ్మూ కశ్మీర్‌లో కత్రా నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరకు మాల్వా ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. అయితే, ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకోపైలట్‌కు గట్టిగానే చెబుతారని.. వాటిని లోకోపైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అయినా, రైళ్లను నిర్ధిష్ట వేగానికి మించి వెళ్లడంపై రైల్వే వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
వంతెనపై రైలు నెమ్మదిగా నడపాల్సిన విషయాన్ని మరిచినట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. వందలాది మంది ప్రయాణికులను ప్రమాదం అంచుల వరకూ తీసుకెళ్లిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై భారతీయ రైల్వే లోకో రన్నింగ్‌మెన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ జనరల్ ఎం తిరుమురుగన్ మాట్లాడుతూ రైలు డ్రైవర్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తు చేశారు. ఈ ఘటన రెండు రైళ్లలో జరిగిందని.. ఇది లోకో పైలట్‌లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను సూచిస్తుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వేలు సమస్యను పరిష్కరించాలని కోరారు.