Rains | హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు ఈ రోజు మాల్దీవులలో కొంత వరకు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈ రోజు బలహీనపడనుంది.