Sunday, December 29, 2024
HomeTelanganaబ్లాక్ మెయిలా..? బలా..? ముఖ్యమంత్రి ఉత్తమ్..

బ్లాక్ మెయిలా..? బలా..? ముఖ్యమంత్రి ఉత్తమ్..

బ్లాక్ మెయిలా..? బలా..?
ముఖ్యమంత్రి ఉత్తమ్..
ప్లేట్ మార్చిన రాజగోపాల్ రెడ్డి
ఎప్పుడో కావాల్సిన వాడంటూ కితాబు..
గంటలోపే హై కమాండ్ కు రిపోర్ట్
మాటల వెనక మర్మమేంటి..?
సీనియర్ల అభిప్రాయామా.., సొంత ఒపీనియనా..?
గతంలోనూ రేవంత్ పై కోమటిరెడ్డి తిట్ల దండకం..
కాంగ్రెస్ మార్క్ మార్పు అని సెట్టర్లు

బలిస్తున్నట్టా..,, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టా..? లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తూ బలిచ్చే కార్యమేమైనా ప్లాన్ చేసినట్టా..? అది పొగడ్తా.., లేదంటే ఇంకేమైనా సంకేతమా..? సరే పొగడ్తే అని సంబురపడాలో., దాని వెనక ఏమై ఉంటుందనే అనుమానంతో ఆలోచనలో పడాలో తెలియని విచిత్ర పరిస్థితి. కీలకమైన రివ్యూలో సీరియస్ గా మాట్లాడుతున్న సందర్భంలో సంబంధం లేని ముచ్చటతో అందరి చూపు అటు వైపే మళ్లాయి. ఆ మాటల వెనక మర్మమేమైనా కావొచ్చునుగానీ, అంతా ఒక్కసారిగా విస్మయం కలిగే పరిణామమే. ఆ మాటకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఓ సంచలనమైతే, అతిరథ మహారథులు, కురువృద్ధులను తోసేసి రేవంత్ సీఎం కావడం ఇంకో వెరైటీ. సీనియర్లంతా ఒకవైపు నడిస్తే, తానొక్కడు మాత్రమే మరో వైపు అన్నట్టుగా పీసీసీ కేటాయింపు నుంచి స్వపక్షంలోనే వివక్ష ఎదుర్కొన్న దయనీయ స్థితి ఆయనది. కలుపుకుపోతూ, చూసిచూడనట్టుగా వెళ్తున్న ఆయనకు ప్రతిసారి ఏదో ఒక సవాల్ తలబొప్పి కట్టిస్తూనే ఉంది. తాజాగా కోమటిరెడ్డి కామెంట్సే అందుకు ఉదహరణ.

=========================
జనపదం, బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ లో అంతర్యుద్ధం నానాటికి పెరుగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన రేవంత్ కు అధిష్టానం కీలకమైన పదవి కట్టబెట్టడంతో సీనియర్లందరికీ మిగుడుపడని వ్యవహారంగా మారింది. సందర్భం వచ్చినప్పుడల్లా వారు తమ అక్కసును, ఆగ్రహాన్ని, ఈర్ష్యా ద్వేషాలను వెల్లగక్కుతూనే ఉన్నారు. అందునా కోమటిరెడ్డి బ్రదర్స్ ది మరింత విచిత్రమే. ఎన్నికల ప్రచార సమయంలోనే వారు తమ అభిప్రాయం, కాబోయే ముఖ్యమంత్రి, ఆ పదవి, ఈ పదవి అంటూ వాళ్లకు వాళ్లే పంచేసుకుని ఓ అడుగు ముందే నిలిచారు. ఎందరెందరో ఉన్నా, వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు, ఇప్పటికీ మారుతున్నారు కూడా.

మంత్రి పదవి కోసం తహతహ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కలలు కంటున్న విషయం తెలిసిందే. విస్తరణ వేళ తప్పకుండా బెర్త్ ఖాయమని ఆశతో ఉన్న ఆయనకు ఆలస్యం చికాకు పుట్టిస్తున్నట్టుగా తోస్తోంది. అసలే ఆయనకు మంత్రిగా కనిపించాలనే కోరిక, నచ్చని రేవంత్ సీఎంగా కొనసాగడం, కేవలం ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఆయనకు మిగుడుపడని పరిస్థితులుగా మారాయి. ఏదిఏమైనా మంత్రిగా మారాలనే ఆయన సంకల్పం ఆలస్యమవుతున్నా కొద్ది వెర్రి తలలు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయనకు మంత్రి పదవి అంటే ఎంత మక్కువో గతంలో ఆయన మాట్లాడిన తీరే నిదర్శణం. ఒకానొక దశలో తన అన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి తీసైనా సరే తనకు పదవి ఇస్తే సంతోషమేనని బహిరంగంగానే ప్రకటించిన ధైర్యశాలి ఆయన.

సీఎం గా ఉత్తమ్..
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారే రేపుతున్నాయి. దేవాదులపై రివ్యూ జరుగుతున్న సమయంలో ఆయన మంత్రి ఉత్తమ్ ను పట్టుకుని ముఖ్యమంత్రి ఉత్తమ్ అంటూ సంబోధించడం సంచలనంగా మారింది. కాకతాళీయంగా కాకుండా కావాలనే అన్నట్టుగా ఆయన చర్యలతో ప్రత్యక్షంగా చూసిన అందరికీ తెలిసిందే. ఆ మాటల వెనక మర్మమేంటి అనేది మాత్రం ప్రస్తుతానికి అంతుచిక్కని చిక్కుమూడే.

రేవంత్ ను బ్లాక్ మెయిలా..?
సీఎం రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికి రాజగోపాల్ రెడ్డి ఆ మాటలు మాట్లాడారా.. లేదంటే ఉత్తమ్ ను కాకపట్టడానికి చేశాడా అనేది సస్పెన్స్. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మంచి ఉంటే ఉండొచ్చుగానీ ఉత్తమ్ కు మాత్రం ఇబ్బందికర పరిస్థితే. సాఫీగా పనిచేసుకుంటూ అనురిస్తున్న సీఎం అండ్ మంత్రి మండలి సాగుతుంటే ఆయన మాటలు గ్యాప్ ను పెంచి సఖ్యత చెరిచేలా మారాయి. మంత్రి పదవి దక్కకుండా రేవంత్ ఏదైనా చేస్తున్నాడనే అనుమానంతో ఆయన మాట్లాడారా.., లేదంటే బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ కామెంట్స్ చేశాడా గానీ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

కాకపట్టడానికా..?
రాజగోపాల్ కి అధిష్టానం నుంచో లేదంటే పార్టీ ఇతర పెద్దల నుంచో ఏమైనా లీకులు వచ్చాయా… అందులో ఉత్తమ్ పేరు ప్రస్తావనలు జరిగాయా తెలియదు కానీ, ముందు నుంచే కాక పట్టే పనిలో నిమగ్నమయ్యాడని తేలిపోతున్నది. అదీ చాలదన్నట్టుగా తనకు నాలుకపై పుట్టు మచ్చ ఉందని, తాను మాట్లాడింది తప్పకుండా జరిగి తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పడం ఇంకా ఆలోచనలకు బీజాలు వేస్తున్నది. పైగా ఉత్తమే సీఎం అనే విషయమై గంటలోపే హైకమాండ్ కు రిపోర్టు కూడా వెళ్లడంతో అసలు కాంగ్రెస్ లో అంతర్గతంగా ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి.

కాంగ్రెస్ మార్క్ మార్పు అని సెట్టర్లు
కాంగ్రెస్ అంటేనే చంచలత్వం అనే అభిప్రాయం ప్రజల్లో పాతుకపోయింది. ఎప్పుడు ఎవరు ఏ పదవిలో ఉంటారో, ఎవరి పోస్టింగ్ ఊస్ట్ అవుతుందో తెలియని గందరగోళం. మహా సముద్రంలాటి పార్టీలో పదవులు మారడం చాలా చిన్న విషయం. ఒకరిని మించి మరొకరు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసే పోటీలో పుల్లలు పెట్టుకోవడం, అధ పాతాళానికి తొక్కేసుకోవడం నేతలకు కూడా పరిపాటే. అందులో భాగంగానే పదవి కాపాడుకోవడానికి నిత్యం అప్రమత్తంగా, నీడను కూడా నమ్మనంత జాగ్రత్తతో మసులుకోవడం ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యే. ఇప్పుడు సీఎంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొనడంతో నిజంగానే మార్పు జరుగుతుందా..? అయినా హస్తంలో ఇలాంటివి కామనేకదా.. అనే సెటైర్లు పెరుగుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు