Conjoined Twins | కవలలు జన్మించడం అరుదు. అవిభక్త కవలలు జన్మించడం కూడా చాలా అరుదు. అయితే మూడు కాళ్లు.. నాలుగు చేతులతో అరుదైన అవిభక్త కవలలు జన్మించారు. ఈ అవిభక్త కవలలకు ఒకటే జననాంగం ఉంది. ఈ కవలలు ఎక్కడా జన్మించారంటే ఇండోనేషియాలో.
ఇండోనేషియాకు చెందిన ఈ అవిభక్త కవలలు 2018లో జన్మించారు. కానీ ఇటీవల ప్రచురితమైన అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ఆ కవలల గురించి రాశారు. 20 లక్షల మందిలో ఒకరు ఇలా పుడుతారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అవిభక్త కవలల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగస్ ట్రిపస్ అని పిలుస్తారు. ఇలా పుట్టడాన్ని స్పైడర్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు.
ఇషియోఫాగస్ ట్రిపస్‌గా పిలవబడే ఈ అవిభక్త కవలల్ని వేరు చేయడం చాలా కష్టం. సర్జరీ చేసి వేరు చేద్దామంటే కూడా సాధ్యపడదు. ఇలాంటి కవలల్లో దిగువ శరీరా భాగం అతుక్కుని పుడుతారు. వీరిలో మొండాలు వేర్వేరుగా ఉంటాయి. దాదాపు 60 శాతం కేసుల్లో ఎవరో ఒక పిల్లాడు చనిపోతుంటారు. కానీ అదృష్టం బాగుండి ఈ కేసులో ఆ సోదరులు ఇద్దరూ బ్రతికే ఉన్నారు.
మొదటి మూడు ఏళ్లు వాళ్లు ఫ్లాట్‌గా కిందనే నిద్రపోయేవారు. బాడీ స్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల వాళ్లు కూర్చునేవాళ్లు కాదు. అయితే ఓ సర్జరీ ద్వారా మూడవ కాలును తీసివేశారు. దాంతో వాళ్ల తొడలు, కాళ్లకు బలం వచ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగలుగుతున్నారు. కాలు సర్జరీ జరిగిన మూడు నెలల తర్వాత కూడా వాళ్లు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. ప్రస్తుతం ఇంకా ఆ కవలలు కలిసే ఉన్నారు. వాళ్లను వేరు చేసేందుకు ఏదైనా సర్జరీ చేస్తారా లేదా అన్న విషయాన్ని ఇంకా డాక్టర్లు నిర్ధారించలేదు.