Wednesday, January 1, 2025
HomeSportsRCB vs CSK|ఇది క‌దా ఆర్సీబీ అంటే..చెన్నైని ఓడించి మ‌రీ ప్లేఆఫ్స్‌కి..!

RCB vs CSK|ఇది క‌దా ఆర్సీబీ అంటే..చెన్నైని ఓడించి మ‌రీ ప్లేఆఫ్స్‌కి..!

RCB vs CSK| ఐపీఎల్ సీజ‌న్ 2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది.నాకౌట్ అనుకున్న ఈ టీం నిన్న రాత్రి జ‌రిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో చెన్నైపై విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 27 పరుగుల తేడాతో చెన్న‌పై ఘ‌న విజయం సాధించింది. సీజ‌న్ మొద‌ట్లో వ‌రుస ఓట‌ముల‌తో చిరాకు తెప్పించిన ఈ జ‌ట్టు సెకండాఫ్ లో వ‌రుసగా ఆరు విజ‌యాలు సాధించి ప్లేఆఫ్స్‌కి చేరింది. ముందుగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ చేయ‌గా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47), గ్లేన్ మ్యాక్స్‌వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54)తో పాటు రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఆర్సీబీకి మంచి స్కోరు ల‌భించింది.

ఇక 219 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టుకి ఆదిలో దెబ్బ తగిలింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ వేసిన తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్(0) డ‌కౌట్‌గా పెవీలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత డారిల్ మిచెల్‌(4)ను యశ్ దయాల్ ఔట్ చేయ‌డంతో సీఎస్‌కే 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది. ఆ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన ర‌హానే.. ర‌చిన్ రవీంద్ర‌తో జ‌త‌క‌ట్టి విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో పవర్ ప్లేలో సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక హాఫ్ సెంచరీ దిశగా సాగుత‌న్న‌ రహానే(33)ను లాకీ ఫెర్గూసన్ ఔట్ చేయ‌డంతో 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన శివమ్ దూబే, రచిన్ రవీంద్రతో క‌ల‌సి స్కోరు బోర్డుని ప‌రుగులెత్తించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే మ్యాక్స్‌వెల్ వేసిన 13వ ఓవర్‌లో శివమ్ దూబే ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సిరాజ్ జార‌విడిచాడు. దీంతో దూబేకి మంచి లైఫ్ వ‌చ్చింది.

కాని అదే ఓవ‌ర్‌ల దూబేతో స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం వ‌ల‌న రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఇక కామెరూన్ గ్రీన్ వేసిన మరుసటి ఓవర్‌లో శివమ్ దూబే(7) భారీ షాట్ ఆడి వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఇక రవీంద్ర జడేజా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్), ఎంఎస్ ధోనీ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) భారీ హిట్టింగ్ చేసిన త‌మ జ‌ట్టుని గెలిపించ‌లేక‌పోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్(2/42) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అయితే య‌శ్ ద‌యాల్ చివ‌రి ఓవ‌ర్‌లో మ్యాజిక్ చేసి త‌మ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించారు..ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‍లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలువాల్సి ఉండగా.. 27 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. చెన్నై ఇంటి బాట ప‌ట్టింది.

RELATED ARTICLES

తాజా వార్తలు