Janapadham_30.09.2024 2 PM News
పితలాటకం..?
రెడ్ మార్కింగ్ కు రెడ్డి సర్కార్ బ్రేక్..
హైడ్రా చర్యలపై మంత్రుల గరం..
రేవంత్ పై అధిష్టానం గుస్సా..
కాంగ్రెస్ లో కలకలం..
బుల్డోజర్లకు స్టాప్..
10 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత..
శాపనార్థాలు పెడుతున్న జనం..
స్వచ్ఛందంగా తరలివేళ్లే వారిపై ప్రభుత్వం ఫోకస్..
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని బుజ్జగింపు
పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తామని హామీ
రెడ్ మార్కింగ్ కు రెడ్డి సర్కార్ విరామం ఇచ్చింది. పెల్లుబికుతున్న నిరసనలు, సొంత పార్టీలో పెదవి విరుపులు.., అధిష్టానం ఆగ్రహం.. వెరసీ రేవంత్ ప్రభుత్వం దిగొచ్చింది. తెగేదాకా లాగితే ఇక మిగిలేది శూన్యమే అని అర్థం చేసుకుని స్టెప్ బ్యాకయ్యింది. హైడ్రా ప్రధాన లక్ష్యం పక్కదారి పట్టిందనే రాష్ట్రవ్యాప్త ఆందోళన నేపథ్యంలో అన్నీ మూసుకుని ప్రత్యామ్నాయం ఆలోచనలో పడింది. రోడ్డున పడుతున్న సామాన్యుడు., శాపనార్థాలు పెడుతున్న మహిళలు, ఇప్పటి కంటే గత ప్రభుత్వమే నయం అనే వైరాగ్యాలతో హైడ్రా బుల్డోజర్లు వెనక్కి వస్తున్నాయి. స్వయంగా పలువురు మంత్రులే రేవంత్ దూకుడును అధిష్టానం దగ్గర ఎండగట్టడమే కాకుండా, సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలతో పార్టీ ఉనికికే ప్రమాదం దాపురించే తీరు వ్యవహరిస్తున్న తీరును ఏకరువు పెడుతున్నారు. బలంగా ఉంటుందనకున్న సర్కార్ బలహీనమవుతున్న దృశ్యాలు కళ్లముందు కనిపిస్తుండడంతో భవిష్యత్ ఎలాఉంటుందోగానీ, వర్తమానం మాత్రం హస్తం పార్టీకి గడ్డుకాలంగానే దాపురించింది.
=================l
జనపదం, బ్యూరో
హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి జనం ఇళ్లపై బుల్డోజర్లు పంపడంపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ జనాన్నే టార్గెట్ చేయడమేంటని మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరును కొందరు మంత్రులు, కాంగ్రెస్ నేతలు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. కొందరు సీనియర్లయితే ఏకంగా అధిష్టానానికే కంప్లయింట్ చేశారని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా బుల్డోజర్ పాలనపై సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో వరుస ఓటములు, ఎమ్మెల్యేల జంపింగ్స్ తో బీఆర్ఎస్ వీక్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి జనం మద్దతుతో మరింత స్ట్రాంగ్ గా మారుతోందన్న భయం పట్టుకుంది. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా బలం పుంజుకుంటే, తమ ప్రభుత్వం ఐదేళ్లు గడపడం కష్టమని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. జనం నిరసన, ప్రతిపక్షాల ఆందోళన, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి మూసీ రెడ్ మార్కింగ్ కి రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ పై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ స్పందించారు. నిర్వాసితులను తప్పకుండా ఆదుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు.
జనం నిరసనలు… ప్రతిపక్షాల ఆందోళనలతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా మూసీ ప్రక్షాళన పేరుతో జనాన్ని వణికించిన ఆర్ బి ఎక్స్ మార్క్ ను ఇక వేయకూడదని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతానికి మూసీ పరివాహక ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా వెళ్ళే వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు.
బెడిసి కొట్టిన యవ్వారం..
హైదరాబాద్ మధ్యలో ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన చేస్తామన్న సర్కార్ ముందస్తు ప్లానింగ్ లేకుండా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని అర్థంతరంగా ఖాళీ చేయించేందుకు ప్లాన్ చేసింది. పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ హైడ్రా అధికారులు ఆర్ బి ఎక్స్ మార్క్ వేయడం ప్రారంభించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి జనంలో ఒకటే అలజడి. వీకెండ్స్ వచ్చాయంటే చాలు ఏ ఇంటికి మార్కు వేస్తారో, ఎప్పుడు రోడ్డుకు ఈడుస్తారో అని భయపడిపోయారు. వందేళ్లు జీవించాలని మిత్తీలకు డబ్బులు తెచ్చి కట్టుకున్న కలల సౌధాలను కూల్చేస్తామని అధికారులు హెచ్చరించడంతో నిలువెల్లా వణికిపోయారు. కొందరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు వెళ్లి తమకు అండగా నిలబడాలని వేడుకున్నారు. మరికొందరు స్థానిక ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్లను ఆశ్రయించారు.
ఒక్కొక్కరిది ఒక్కో కథ…
ఒకరు రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే… మరొకరు కూలీ నాలీ చేసి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నరు… ఇంకొకరు బ్యాంక్ లోన్ తీసుకొని… రోజూ తిన్నా తినకున్నా… నెల నెలా కిస్తీలు కట్టుకుంటూ బతుకుతున్నారు. అన్ని పర్మిషన్లు తీసుకొని 20 యేళ్ళ క్రితం నిర్మించిన ఇళ్ళు ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఉత్తర భారతదేశంలో కనిపిస్తున్న బుల్డోజర్ పాలన… ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు.
హరీశ్ ధైర్యంతో జనం ముందడుగు..
మూసీ పరివాహక బాధితులు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్ కు క్యూ కట్టడంతో వాళ్ళ గోసను దగ్గరుండి విన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పేదల హృదయ వేదనపై హరీశ్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు. మూసీ ఏరియాలో పేదల ఇళ్ళను కూల్చడానికి వస్తే… బుల్డోజర్ల ముందు అడ్డంగా పడుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు. ఆదివారం నాడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి హైదర్‌షాకోట్‌లో ఇండ్లను పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పించారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా… తెలంగాణ భవన్‌కు రండి. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్. అర్ధరాత్రి వచ్చినా.. మీకు ఆశ్రయమిస్తామని ఇండ్ల బాధితులకు హరీశ్ హామీ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే.. కానీ నువ్వు కూల గొట్టే పేదల ఇండ్లు జీవిత కాలమని గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు హరీశ్. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోకు… మొద్దు నిద్ర పోతున్న రేవంత్ ను తట్టి లేపేందుకే మేమంతా మీ ముందుకొచ్చినమని హైదర్ షా కోట బాధితులకు హరీశ్ రావు భరోసా ఇచ్చారు. . జనమంతా ధైర్యంగా ఉండాలని… బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో 24 గంటలూ అందుబాటులో ఉంటుందనీ… పేదలకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. అటు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు కూడా ఆందోళనకు సిద్ధమవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
స్వచ్ఛంద తరలింపుపై నజర్..
మూసీ పరివాహక ప్రాంతంలో జనాన్ని బలవంతంగా ఖాళీ చేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించింది ప్రభుత్వం. అందుకే స్వచ్ఛంధంగా అక్కడి నుంచి తరలి వెళ్ళే వారిపై దృష్టి పెట్టింది. అలా వెళ్ళే వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తామని చెబుతున్నారు అధికారులు. నిర్వాసితులకు ప్రభుత్వం తరపున ఉపాధి, సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఇళ్ళు ఖాళీ చేసే వారి సామాగ్రిని ప్రభుత్వ ఖర్చుతో తరలించాలని అధికారులు నిర్ణయించారు. పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా… నిర్వాసిత ప్రదేశాల్లో ఉన్న సర్కారీ బడుల్లో ప్రవేశాలు కల్పిస్తామంటున్నారు. అవసరమైతే గురుకులాల్లో చేరుస్తామని కూడా అధికారులు హామీ ఇస్తున్నారు. మొత్తానికి బాధితులు, ప్రతిపక్షాల పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ఏరియాలో రెడ్ మార్క్ కి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అర్థమవుతోంది.