హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. తర్వాత గాంధీభవన్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ఆర్ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాహుల్‌ను ప్రధాని చేయాలని వైఎస్‌ఆర్ సంకల్పించారు. రాహుల్‌ను ప్రధానిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది. వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే రాహుల్‌ను ప్రధానిని చేసే విధంగా మనం ముందుకెళ్లాలి. వైఎస్‌ఆర్ ఆశయం అంటే సంక్షేమం, అభివృద్ధి. మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన వారికి ఛైర్మన్ పదవులు ఇచ్చాం. ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదు’’ అని రేవంత్ తెలిపారు.