Rohit Sharma| హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అతను కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించగా, ఈ సారి మాత్రం ఆటగాడిగా బరిలోకి దిగాడు. రోహిత్‌ని కెప్టెన్సీ నుండి తొలగించినప్పటి నుండి ఆయన అభిమానులు ఆగ్రహంగానే ఉన్నారు. రోహిత్ విషయంలో ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ తప్పుగా వ్యవహరిస్తే ఆయనని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో ముంబై జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ మైదానంలో కనిపించలేదు. రోహిత్ ను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చడంపట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు.
ముంబై జట్టుకు ఐదు సార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎలా ఆడిస్తారు అంటూ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై గుర్రుగా ఉన్న అభిమానులు నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడంపై మరింత ఫైర్ అవుతున్నారు. అయితే రోహిత్ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నా కూడా రెండో ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ చేశాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు ఆడాడు అనే విషయంపై ఇప్పటకీ అందరి మదిలో అనేక అనుమానాలు తలెత్తాయి.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ప్రముఖ స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా .. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి గల కారణం వివరించాడు. రోహిత్ వెన్నులో సమస్య ఉందని, దాని వలన కొంత ఇబ్బంది పడుతున్నందుకు మేనేజ్‌మెంట్ ముందుజాగ్రత్తగా అతనిని ఫీల్డింగ్ చేయనివ్వలేదని స్పష్టం చేశాడు. మరి కొద్ది రోజులలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కి రోహిత్ కీలకమైన ఆటగాడు కాబట్టి అతను పూర్తిగా ఫిట్‌గా ఉండేందుకు కాస్త విశ్రాంతిని ఇచ్చినట్టు తెలుస్తుంది.అయితే రోహిత్‌కి గాయం అయిందని తెలిసి ఆయన అభిమానులు కాస్త ఆందోళనలో ఉన్నారు.