Rohit| హార్ధిక్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరచడం మనం చూశాం. ఐపీఎల్ 2024 లో నాకౌట్ అయిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. హార్ధిక్ కెప్టెన్ అయిన తర్వాత టీంలో పరిస్థితులు మారాయి. రోహిత్, హార్ధిక్ మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, పలువురు ఆటగాళ్లతో కూడా హార్ధిక్‌కి పడడం లేదని వార్తలు వచ్చాయి. దారుణమైన ప్రదర్శన తర్వాత వివాదాలు మరింత ముదిరాయి. ఇక ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబరచిన హార్ధిక్ పాండ్యాని టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయడం కూడా హాట్ టాపిక్ అయింది. హార్దిక్ పాండ్యాని జట్టులో తీసుకోవడం అటు కెప్టెన్ రోహిత్ శర్మకు, ఇటు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్కి ఏ మాత్రం ఇష్టం లేదని కాని తీవ్రమైన ఒత్తిడి మూలంగానే ఆయనని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.
మరి కొద్ది రోజులలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించబోతున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల రోహిత్ తనని కెప్టెన్సీ నుండి తొలగించడంపై ముంబై ఇండియన్స్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ తో మాట్లాడిన మాటలు బయటకు రావడంతో లోలోపల ఏం జరుగుతుందో అర్ధమవుతుంది. తాజాగా నెట్స్ లో హార్దిక్ ను చూడగానే రోహిత్, సూర్య అక్కడి నుండి వెళ్లిపోవడం కూడా అనేక అనుమానాలు కలిగిస్తుంది.
ఇక హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 2024 చేదు విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి. ఎప్పుడు అయితే రోహిత్ శర్మ నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడో అప్పటి నుండి బ్యాడ్ టైం నడుస్తుంది. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగి..చివరికి, ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చిన తొలి జట్టుగా చెత్త రికార్డ్ మూటగట్టుకోవడం, అలానే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాలలో హార్ధిక్ పాండ్యా తేలిపోవడం, ఆ క్రమంలోనే ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరగడం మనం చూశాం. కెప్టెన్సీ మార్పు వలన వచ్చిన ఇన్ని సమస్యలకి చెక్ ఎప్పుడు పడుతుందో చూడాలి.