Ross Taylor| ఐపీఎల్ సీజన్ 17 మరి కొద్ది రోజులలో ముగియనుంది. అయితే ఈ సీజన్ మాత్రం క్రికెట్ లవర్స్‌కి మంచి మజాని అందించిందనే చెప్పాలి.మరోవైపు పలు వివాదాలకి కూడా కేరాఫ్‌గా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్, ఘర్షణలు, విమర్శలు ఇలా చాలానే నడిచాయి. అయితే ఈ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా అందరి ముందు తిట్టడం. మ్యాచ్ ఓడిపోయాక డగౌట్‌కి వచ్చిన కేఎల్ రాహుల్‌ని అందరి ముందు మందలించాడు సంజీవ్. ఇది కెమెరాలలో రికార్డ్ కాగా, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అందులో కేఎల్ రాహుల్ తన టీమ్ ఓనర్ కి సర్ధి చెప్పే ప్రయత్నం చేసిన కూడా అతను చాలా గట్టిగా అరిచాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సంజీవ్ గోయెంకాని తిట్టిపోసారు. టీమ్ కెప్టెన్ అయిన రాహుల్‌తో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత అతను రాహుల్‌ని హగ్ చేసుకొని కూల్ చేసాడు అనుకోండి. అయితే ఈ కాంట్రవర్సీ గురించి చర్చ జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ లెజెండ్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను తిడితేనే అందరూ ఇంతలా ఫీల్ అవుతున్నారని.. తనను అప్పట్లో ఓ ఐపీఎల్ టీమ్ ఓనర్ ఏకంగా కొట్టాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ మాజీ కో ఓనర్ అయిన రాజ్ కుంద్రా రాస్ టేలర్‌పై చేయి చేసుకున్నాడట.
రాస్ టేలర్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌ను అతడి టీమ్ ఓనర్ తిట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని సహించడానికి వీల్లేదు. అయితే రాహుల్‌ను తిట్టారు.. నన్ను ఏకంగా కొట్టారు. రాస్.. నీకు మిలియన్ డాలర్లు ఇచ్చేది డకౌట్ అవ్వడం కోసం కాదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి, రెండుసార్లు కాదు.. నాలుగైదు సార్లు నా ముఖం మీద కొట్టాడు. కొట్టడమే గాక నా వైపు ఎగతాళిగా చూస్తూ నవ్వాడు’ అని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఇది తెలుసుకున్న నెటిజన్స్ మండిపడుతున్నారు. సరిగ్గా ఆడకపోతే వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి తప్ప చేయి చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.