RR vs DC| నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై మంచి విజయం సాధించింది. హోం గ్రౌండ్‍లో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) విరుచకుపడడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్‌లో అశ్విన్ ఒక్కడు మాత్రమే చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్స్ తీసుకున్నాడు. అశ్విన్(3/24) మూడు వికెట్లతో రాణించగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆర్ఆర్‌కి మరో ఓటమి తప్పలేదు.ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్(4) పెవీలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ క్రీజులోకి రాగా, బట్లర్‌తో కలిసి ధాటిగా ఆడాడు. వీరిద్దరు ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించారు. 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడికి అక్షర్ పటేల్ బ్రేక్ వేశాడు. 19 పరుగులు చేసిన బట్లర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లు కోల్పొయింది.
ఇక తర్వాత వచ్చిన రియాన్ పరాగ్(25)ను క్లీన్ బౌల్డ్ చేశాడు రసిక్ సలామ్. అయితే మరోవైపు సంజూ శాంసన్ చూడ చక్కని షాట్స్ ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం దూకుడగా ఆడిన సంజూ శాంసన్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అయితే హోప్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో సంజూ శాంసన్ పెవీలియన్ బాట పట్టక తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన శుభం దూబే (12 బంతుల్లో 25 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఫెరీరా (1), రవిచంద్రన్ అశ్విన్ (2), రవ్మన్ పావెల్ (13) సహా ఎవరూ కూడా పెద్దగా బ్యాట్ ఝుళిపించకపోవడంతో
ఆర్ఆర్ కి ఓటమి తప్పలేదు.