RR vs PBKS| రాజస్తార్ రాయల్స్ ఫస్టాఫ్‌లో ఆడిన ఆట తీరు చూస్తే ఈ సారి కప్ వాళ్లకే అని అందరు ఫిక్స్ అయ్యారు. కాని ప్లే ఆఫ్స్‌కి సమీపిస్తున్న సమయంలో వారు చెత్త ఆటతో అభిమానులని తీవ్ర నిరాశ పరుస్తున్నారు. ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్…. ముంబై, చెన్నై వంటి బలమైన జట్లను చిత్తుగా ఓడించి టేబుల్ టాప్‌లో నిలిచింది. ఈ జట్టు ఫైనల్‌కి చేరుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని తీరా చూస్తే చెత్త ఆటతో వీరు కప్ కొట్టడం కష్టమే అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారు. బుధవారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ అయిదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయ సాధించింది.
రాజస్తాన్ బ్యాటర్స్ రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6×4), రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 3×4, 1×6) పంజాబ్ బౌలర్స్‌ని కాస్త ప్రతిఘటించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 144 పరుగులు చేసింది. సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) చెలరేగి బౌలింగ్ చేయడంతో రాజస్థాన్‌కి పరుగులు రాబట్టడం చాలా కష్టమైంది. ఇక స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన పంజాబ్‌కి కూడా పెద్దగా ఆరంభం లభించలేదు. పంజాబ్ ఓపెనర్లు బెయిర్ స్టో (14 రన్స్), ప్రభ్ సిమ్రాన్ (6 రన్స్) తక్కువ పరుగులు చేసి పెవీలియన్ బాట పట్టారు. ఇక ఈ సీజన్‌లో పంజాబ్ తరపున పరుగుల వరద పారించిన శశాంక్ సింగ్ డకౌట్ కావడం, హిట్టర్ రూసో కూడా 22 పరుగులకే వెనుదిరగడం పంజాబ్‌లో టెన్షన్ పుట్టించింది.
48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలలో ఉన్న సమయంలో సామ్ కరన్ (63*; 41 బంతుల్లో, 5×3, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. జితేశ్ శర్మ (22; 20 బంతుల్లో, 2×6)తో కలిసి అయిదో వికెట్‌కు 46 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ముందు నిదానంగా ఆడిన ఈ జోడి తర్వాత రెచ్చిపోయి ఆడారు. ఈ క్రమంలో 145 పరుగుల టార్గెట్‌ను 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్ కేకేఆర్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలవకపోయిన ప్లే ఆఫ్స్‌కి చేరుకుంటుంది కాని రెండో స్థానంలో ఉండడం కష్టమే.