రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేక అరిగోస పడుతున్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులే స్వయానా చెబుతున్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక సిబిల్ స్కోర్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులకైతే గత 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. నిరుద్యోగుల ఆవేదనను లెక్క చేయడం లేదు. చేతగాని నిరంకుశ కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
10వ తారీఖు వచ్చినా జీతాలు పడలేదు
జూలైలో 10వ తేదీ గడిచినా ఇప్పటికీ వేతనాలు వేయలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సొసైటీల్లో ముందుగానే వేతనాలను చెల్లిస్తున్నా, తమ సొసైటీలో మాత్రం ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. సొసైటీ ఉన్నతాధికారుల అలసత్వం వల్లే ఇదంతా జరుగుతున్నదని మండిపడుతున్నారు. వేతనాలను ఒక నిర్ణీత తేదీ లేకుండా ప్రతి నెలా ఏదో ఒక తేదీన వేస్తున్నారని, ఫలితంగా సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.