Undersea Coastal Road Tunnel | ముంబయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తొలి సొరంగమార్గం కోస్టల్‌లోకి నీరు లీకవుతున్నది. మూడు నెలల కిందట నిర్మించిన టన్నెల్‌లోకి నీళ్లురావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే, లీకేజీకి కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనికి వెనుక కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. టన్నెల్‌లో నీరు లేకేజీ ప్రాంతాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కమిషనర్‌కు ఫోన్ చేశానని.. రెండు, మూడు చోట్ల నీరు లీకవుతోందన్నారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడారన్నారు. సొరంగానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. ప్రత్యేక సాంకేతికత ద్వారా సొరంగం గోడల్లోని ఖాళీలను నింపుతామన్నారు. వానాకాలంలో సైతం నీరు లీకయ్యే ప్రమాదం ఉందని.. ఇది సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 1967 నాటి నగర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ సముద్ర సొరంగాన్ని ప్లాన్ చేశారు. ఇటీవలే సొరంగం మొదటి దశను సీఎం ఏక్‌నాథ్ షిండే.
డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రారంభించారు. రెండో దశ జూన్ 10న ప్రారంభించాల్సి ఉన్నది. 2.07 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం గిర్‌గావ్ నుంచి బ్రీచ్ కాండీ బీచ్ వరకూ సముద్రం అడుగున నిర్మించారు. ఈ సొరంగం కారణంగా ప్రయాణ సమయం 45 నిమిషాల నుంచి పది నిమిషాలకు తగ్గింది. రెండు సొరంగాలు రెడీ కాగా.. ఇందులో ఒకదాన్ని మాత్రమే వినియోగంలోకి తీసుకువచ్చారు. 12.19 మీటర్ల వ్యాసం ఉన్న ఈ సొరంగాలను నీటి ఉపరితలానికి 12 నుంచి 20 మీటర్ల అడుగున నిర్మించారు. దేశంలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగ మార్గంగా అరుదైన గుర్తింపును సాధించింది.