Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక సమయంలో తుది విడుత పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. మొత్తానికి 18వ లోక్‌సభను కొలువుదీర్చేదేవరో అనే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా ఉంది.
చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ, అనురాగ్ ఠాకూర్, మహేంద్ర నాథ్ పాండే, అనుప్రియా పటేల్, కంగనా రనౌత్, మీసా భారతి, విక్రమాదిత్య సింగ్, అభిషేక్ బెనర్జీ, రవి కిషన్, ఆర్కే సింగ్, పంకజ్ చౌదరీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
నేటితో జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం అయింది. ఇప్పటి వరకు ఆరు దశల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఏడో దశలో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగడ్‌తో పాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. పంజాబ్‌లో మొత్తం 13 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది.