మళయాల సినీరంగంలో లైంగిక వేధింపుల వివాదం
కేరళలోని మళయాల సినీ రంగంలో మహిళలపై వేధింపుల వివాదం తీవ్ర స్థాయికి చేరుకున్నది. సినిమా రంగంలో మహిళలను లైంగికంగా వేధించడంపై ఎంతో కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 2017 లో ప్రముఖ మళయాలీ నటి పై దుండగులు కారులో రెండు గంటల పాటు అత్యాచారం జరిపారన్న వార్త ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది. అప్పటినుంచి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతుంది. సినిమా పరిశ్రమలో మహిళల పరిస్థితుల విషయమై కేరళ ప్రభుత్వం హేమ కమిటి ని ఏర్పాటు చేసింది. ఆ కమిటి నివేదికను కేరళ ప్రభుత్వం ఆగష్టు 19 న సంక్షిప్త రూపంలో విడుదల చేసింది. మొత్తం 295 పేజీల నివేదిక బయటపడితే పలువురు సినీ ప్రముఖుల బండారం బయట పడుతుందని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు ఈ విషయం పై మౌనం వహిస్తున్నారు. హేమ కమిటి నివేదిక మొత్తం బయట పెట్టాలని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సినిమా పరిశ్రమలలో మహిళలను లోబరుచుకోవడంతో పాటు కనీస వసతులు లేని అంశాన్ని కూడా హేమ కమిటీ వెళ్లడించింది. మహిళలకు బట్టలు మార్చుకునే వసతులు కూడా లేవని వెళ్లడించింది.