శివాజీ విగ్రహం కూలడం పై వివాదం
మహారాష్ట్ర లోని సింధూదుర్గ్ లో గల చరిత్రాత్మకమైన రాజ్ కోట్ కోటలో నెలకొల్పిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగష్టు 26వ తేదీన కూలిపోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ విగ్రహాన్నిగత ఏడాది డిసెంబర్ 4వ తేదీన నావికా దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మరాఠా మహా యోధుడైన శివాజీ ని మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆరాధనతో చూస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీ విగ్రహావిష్కరణ ఎంతో అట్టహాసంగా జరిగింది. దీనికి ఎంతో ప్రచారం లభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై ఒకవైపు బీజేపీ మరోవైపు శరద్ పవార్-ఉద్దవ్ ఠాక్రే వర్గం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. విగ్రహం కూలడానికి ఎవరు బాధ్యులనే విషయంపై కూడా చర్చ సాగుతున్నది. ఇందుకు సంబంధించి పబ్లిక్ వర్క్స్ శాఖ, నావికా దళం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. శివాజీ విగ్రహం కింద పీఠాన్ని మాత్రమే తాము నిర్మించామని PWD అంటున్నది. శివాజీ విగ్రహ నిర్మాణ బాధ్యతలు నావికా దళం చేపట్టింది. ఈ విగ్రహ నిర్మాణ కాంట్రాక్ట్ ను జయదీప్ ఆప్టే కు అప్పగించింది. మూడు నెలల్లోనే విగ్రహ నిర్మాణం పూర్తయి ఆవిష్కరణ జరిగింది. విగ్రహాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే పరారీలో ఉన్నాడు. అతడు బీజేపీ కూటమి ప్రభుత్వానికి సన్నిహితుడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విగ్రహానికి సంబంధించిన నట్లు, బోల్టులు తుప్పు పట్టి ఉండడం పై నావికా దళానికి ఆగష్టు 22 న PWD లేఖ రాసింది. ఆ తర్వాత నాలుగు రోజులకే విగ్రహం కూలిపోయింది. తాము విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్ఠాపనను పర్యవేక్షించామని కానీ, విగ్రహ నిర్మాణం తర్వాత దాని నిర్వహణ బాధ్యత స్థానిక ప్రభుత్వానికే ఉంటుందని నావికా దళం వర్గాలు అంటున్నాయి. పర్యాటక క్షేత్రమైన సింధూ దుర్గ్ లో నావికదళ సిబ్బంది ఉండదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ శాఖలే దీని నిర్వహణ బాధ్యత చూసుకోవలిసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే రాజ్ కోట్ కోట ప్రాంగణ నిర్వహణ మాత్రమే తాము చూసుకుంటామని విగ్రహ పరిరక్షణ నిర్వహణ బాధ్యత నావికా దళానిదేనని PWD వర్గాలు అంటున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహ పరిరక్షణ విషయమై ఏ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. బలమైన గాలులు, భారీ వర్షం శివాజీ విగ్రహం కూలిపోవడానికి కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అభిప్రాయ పడ్డారు. విగ్రహం కూలిపోవడానికి నిరసనగా ప్రతిపక్షాలు ఊరేగింపులు నిర్వహిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా తాముకూడా ఊరేగింపు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. విగ్రహం కూలడం పై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు పానెల్ ను నియమించింది. ఆ పానెల్ నివేదిక ఇంకా రావల్సి ఉంది.