Coronavirus | సింగపూర్ : మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉంది. తాజాగా సింగపూర్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25,900కు పైగా కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ పేర్కొన్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో సింగపూర్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని ఆరోగ్య శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.
మళ్లీ కొత్తగా కరోనా ఉధృతి మొదలవుతోంది. క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. మరో నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నిత్యం దాదాపు 250 మంది కరోనాతో హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా హాస్పిటల్స్ కూడా సిద్ధం కావాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
కరోనా రోగులకు అవసరమైన బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొవిడ్ కిట్‌లను కూడా సిద్ధం చేయాలని, తొలి దశలోనే కరోనాను అంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం కాని సర్జరీలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని సింగపూర్ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.