Friday, April 4, 2025
HomeAndhra PradeshChilakaluripet | చిల‌క‌లూరిపేట‌లో బ‌స్సును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. మంట‌లు చెల‌రేగి ఆరుగురు స‌జీవద‌హ‌నం..

Chilakaluripet | చిల‌క‌లూరిపేట‌లో బ‌స్సును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. మంట‌లు చెల‌రేగి ఆరుగురు స‌జీవద‌హ‌నం..

ప‌ల్నాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి చిలకలూరిపేట (Chilakaluripet) మండలం ఈవూరివారిపాలెం స‌మీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును టిప్ప‌ర్‌ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగ‌డంతో ఇద్దరు డ్రైవర్లతోస‌హా ఆరుగురు సజీవ దహనమయ్యారు. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చిలుక‌లూరిపేట ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదానికి గురైన అరవింద ట్రావెల్స్‌ బస్సు.. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైద‌రాబాద్ బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. బాధితులంతా లోక్‌స‌భ ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమ‌య్యారే కావడం గ‌మ‌నార్హం.

మంగళవారం అర్ధరాత్రి 1.30 గంట‌ల సమయంలో చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ అదుపుత‌ప్పి బస్సును ఢీ కొట్టింది. దీంతో క్షణాల్లో టిప్పర్‌కు మంటలు అంటుకున్నాయి. వెంట‌నే అవి బస్సులోకి కూడా వ్యాపించాయి. దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులను బస్సు డ్రైవర్‌ అంజితో పాటు ఉప్పుగుండూరు కాశీయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. టిప్పర్ అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు