SKY| ఐపీఎల్ సీజన్ 17 చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రతి ఒక్క టీం కూడా ప్లేఆఫ్స్‌పై ఫోకస్ చేశాయి. ప్లేఆఫ్స్ చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. గత రాత్రి జరిగిన హైదరాబాద్, ముంబై మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి ముంబై జట్టుకి మంచి విజయాన్ని అందించాడు. ముందుగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48)కి పలు అవకాశాలు వచ్చిన కూడా దానిని పెద్ద స్కోరుగా మలవలేకపోయాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. చివరలో ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 35 నాటౌట్) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో హైదరాబాద్ జట్టు 173 పరుగులు చేయగలిగింది.
ముంబై ఇండియన్స్ బౌలర్స్ చాలా పద్దతిగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు. 174 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు ఓపెనర్స్ మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇషాన్ కిషన్(9), రోహిత్ శర్మ(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో అద్భుతమైన బంతికి ఇషాన్ కిషన్ వెనుదిరగక తప్పలేదు.. ఇక కమిన్స్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ చెత్త షాట్ ఆడి పెవీలియన్ బాట పట్టాడు. ఇక ఫస్ట్ డౌన్‌లో వచ్చిన నమన్ ధీర్ పరుగులు చేయలేకపోయాడు. చివరికి అతను డకౌట్‌గా భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ చెత్త బంతి దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. మొదట క్రీజులో సెట్ అయ్యేందుకు కొంత సమయం తీసుకొని ఆ తర్వాత బంతిని బౌండరీలకి తరలించడం మొదలు పెట్టారు. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత విరుకుపడ్డాడు.సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) అదిరిపోయే శతకం సాధించాడు. ఇక మరోవైపు తిలక్ వర్మ(32 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించడంతో విజయం సులువు అయింంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్ లకి తలో వికెట్ దక్కింది.