అమరావతి: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) అండమాన్ తీరాన్ని తాకాయి.. ఈ నెల 31న కేరళలో, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడం.. 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని చెప్పింది.
ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఆవర్తనం కొనసాగుతున్నది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కాగా, దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే ప్రవేశించారు. జూన్ 1న కేరళలోకి ప్రవేశించి జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి.
రుతుపవనాల పురోగతి, ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఐఎండీ కొన్ని ప్రమాణాలను అనుసరిస్తుంది. ఐఎండీ ప్రకారం.. దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో (3 కిలోమీటర్ల వరకు) కొలిచే పశ్చిమ గాలుల బలం దాదాపు 20 నాట్స్‌కి పెరిగింది. ఈ ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి గాలులు వీచాయి. మేఘాలు సైతం పెరిగాయి. ఈ ప్రాంతంలో అవుట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ (OLR) చదరపు మీటరుకు 200 వాట్ల కంటే తక్కువగా ఉన్నది.