SRH vs KKR| ఈ సారి శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు దూసుకుపోతుంది. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే టేబుల్‌లో టాప్ ఉన్న ఈ జట్టు గత రాత్రి జరిగిన క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్‌హెచ్‌పై ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍పై మంచి విజయం సాధించి డైరెక్ట్‌గా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది కేకేఆర్ జట్టు. ఇక సన్‌రైజర్స్‌కి మరో అవకాశం ఉండగా, వారు ఆర్ఆర్, ఆర్సీబీలలో గెలిచిన జట్టుపై ఆడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కి వెళతారు. లేదంటే ఇంటి బాట పడతారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా,.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/34) నిప్పులు చెరిగే బంతులు విసిరి మూడు వికెట్స్ తీసారు. ఇక వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ దక్కింది. ఇక లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ జట్టు ఓపెనర్ల వికెట్లని తొందరగానే దక్కించుకుంది. కాని తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలు అలవోకగా ఆడుతూ 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు. సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో క్వాలిఫయర్ మ్యాచ్ చాలా చప్పగా సాగింది.
ఇక కోల్‍కతా నైట్‍రైడర్స్ ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్స్ చేరగా, వారు 2012, 2014, 2021లో కూడా తుదిపోరుకి చేరుకున్నారు. అయితే 2012, 2014లో మాత్రమే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సారి కేకేఆర్ జోరు చూస్తుంటే కప్ అందుకునేలానే కనిపిస్తున్నారు. మూడో టైటిల్ లక్ష్యంగా మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేస్తారా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.