SRH vs RR| క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి ఫైనల్‌కి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి మజా అందించింది.ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకోగా, మళ్లీ 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది ఎస్ఆర్‌హెచ్ జట్టు. ఇక మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ షెహ్‌బాజ్ అహ్మద్(3/23), అభిషేక్ శర్మ(2/24) సంచలన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి చక్కని విజయాన్ని అందించాడు.
ముందుగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లతో 50) అర్ధ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓ మోస్తరు స్కోరు సాధించారు. అయితే ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా చేజ్ చేస్తుందని, కోల్‌కతాతో ఫైనల్ ఆడేది ఆర్ఆర్ జట్టే అని చాలా మంది అనుకున్నారు. కాని హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కి వెళ్లింది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు మంచి శుభారంభం లభించలేదు. ఓపెనర్ టామ్ కోహ్లేర్(10) కమిన్స్ బౌలింగ్‌లో తొందరగానే ఔటైన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 6వ ఓవర్‌లో జైస్వాల్ 6 ,4, 0, 4, 4, 1తో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి మంచి పొజీషన్‌లో ఉంది. అప్పుడే కమిన్స్.. షెహ్‌బాజ్ అహ్మద్‌ని దింపాడు. అహ్మద్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో సిక్సర్ బాదిన యశస్వి(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వా సంజూ శాంసన్ భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) , షిమ్రాన్ హెట్‌మైర్(4), రోవ్‌మన్ పోవెల్(6) వెంటవెంటనే ఔట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం చెందింది. ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.