(జనపదం, వరంగల్)
వరంగల్ సికేఎం ప్రసూతి ఆసుపత్రిలో (CKM Maternity Hospital) వైద్యుల నిర్లక్ష్యం మితిమీరిపోయింది. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది లేక పోవడంతో గర్భిణీలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించడం గమనార్హం.
నిరుపేద ప్రజలు ఎక్కువగా ఉండే ఆసుపత్రి అయినందున, సిబ్బంది వ్యవహారంతో గర్భిణీ స్త్రీలు అయోమయానికి లోనవుతున్నారు. ఈ మద్య కాలంలో తరచూ సీకేఎం ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక పాప కనిపించకుండా పోతే పోలీసులు కేసు నమోదు చేసుకుని 48 గంటలలోనే ఛేదించారు.
సమస్యలకు నిలయంగా మారిన ఆసుపత్రిపై అధికారులు తగిన చర్యలు తీసుకుని గర్భిణీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.