లక్నో: విధుల్లో ఉన్న ఓ స్టేషన్ మాస్టర్ (Station Master) చేసిన పనికి సిగ్నల్ లేక ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో చోటుచేసుకుంది. పాట్నా-కోటా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (Patna-Kota Express) రైలు ఈ నెల 3న ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ మాంచి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపేశాడు. సుమారు అర్ధగంటపాటు అలాగే వేచిఉన్న లోక్‌పైలట్.. స్టేషన్ మాస్టర్‌ను నిద్రలోనుంచి లేపేందుకు అనేక సార్లు హారన్ కొట్టాడు. ఎట్టకేలకు ఆయన మేల్కొనడంతో రైలు మళ్లీ తన గమ్యస్థానానికి పయణమయింది.
కాగా, అప్పటికే రైలు అక్కడ సుమారు అరగంటపాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు.. స్టేషన్ మాస్టర్‌నుంచి వివరణ కోరారు. ఆయనపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. తనతోపాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో.. తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నానని, ఈ క్రమంలోనే నిద్రలోకి జారుకున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు.
అయితే ఉడిమోర్ రోడ్ స్టేషన్ చిన్నదే అయినప్పటికీ ఇటావాకు ముందున్న ముఖ్యమైన స్టేషన్ అని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ నుంచి ఆగ్రా వెళ్లే రైళ్లు ఈ స్టేషన్ మీదుగానే వెళ్తాయన్నారు. అదేవిధంగా ఝాన్సీకి వెళ్లే రైళ్లు కూడా ఈ స్టేషన్‌ను దాటుకునే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ మార్గంలో ఎలాంటి రైళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెళ్లడించారు.