Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను పదవిలో నుంచి తొలగించాలంటూ దాఖలను పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. మద్యం పాలసీ కేసులో సీఎంను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండురోజుల కిందట లోక్‌సభల ఎన్నికల నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మద్యం పాలసీ కేసు ఆరోపణలతో ఆయనను సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయని.. ఆయనకు ఆ పదవిలో ఉండే హక్కు లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఆరోపణలు ఉన్నంత మాత్రాన సీఎంను తొలగించే చట్టపరమైన హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అవసరమైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించవచ్చని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చిలో ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేసింది. మొన్నటి వరకు జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌లో ఉన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు జూన్ ఒకటి వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, సీఎంగా ఎలాంటి అధికారిక కార్యకలాపాలు చేపట్టొద్దన్న కోర్టు.. తిరిగి జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.