T20 WorldCup 2024| ప్రస్తుతం ఐపీఎల్ సమరం హోరాహోరీగా నడుస్తుంది. ఇది పూర్తైన కొద్ది రోజులకి టీ20 వరల్డ్ కప్ 2024 సమరం మొదలు కానుంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే ఇది మొదలు కానుండడంతో క్రికెట్ ప్రేమికులకి నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుతుంది. అయితే వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా ఈ టోర్నీ జరగనుండడంతో ఈ సారి ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి అందరలో ఉంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీ ఆడబోతున్నాయి. ఏ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది, ఏ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుంది అనే దానిపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది.
తొలిసారి టీ20 వరల్డ్ కప్ 2007లో జరిగింది. అప్పుడు టీమిండియా విశ్వవిజేతగా నిలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తించింది. యంగ్ టీమ్‌తో ధోని సంచలనాలు సృష్టించి భారత్‌కి కప్ అందేలా చూశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను 5 పరుగులతో ఓడించి కప్పు గెలవడం మనందరం చూశాం. ఆ మూమెంట్స్ ఇప్పటికీ కళ్లముందే కదలాడుతుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా మళ్లీ కప్ గెలవలేదు. ఈ సారి తప్పక గెలవాలనే కసితో మాత్రం ఉన్నారు. రోహిత్, విరాట్ కోహ్లిలకు బహుషా ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో వారు గట్టిగా ఆడే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచింది ఇంగ్లండ్, వెస్టిండీస్. ఇంగ్లండ్ 2010లో జరిగిన వరల్డ్ కప్ తోపాటు చివరిసారి 2022లో జరిగిన వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఇక వెస్టిండీస్ 2012, 2016లలో విజేతగా నిలిచింది. ఇక ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ కాకుండా వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్ చూస్తే అందులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. 2009లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. తొలి వరల్డ్ కప్ సమయంలో ఫైనల్‌లో ఇండియాపై ఓడిన తర్వాతి వరల్డ్ కప్‌లో మాత్రం గెలిచింది. ఇక 2014లో శ్రీలంక, 2021లో ఆస్ట్రేలియా కప్ దక్కించుకున్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ ను ఆరుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం చెప్పుకోదగ్గ రికార్డ్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ సారి వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తొలిసారైన కప్ గెలవాలనే కసితో ఉన్నారు.