Actor Arulmani | దక్షిణ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి (65) కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సినీ నటులు సంతాపం ప్రకటించారు. అరుళ్మణి రజనీకాంత్ నటించిన ‘లింగ’, సూర్య ‘సింగం’ చిత్రాల్లో కీలక పాత్రలో పోషించారు. కొద్దిరోజుల కిందట రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీలో అరుళ్మణి క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
గత గురువారం విశ్రాంతి తీసుకునేందుకు ఆయన చెన్నైకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు హాస్పిటల్‌కు తరలించినా లాభం లేకపోయింది. గుండెపోటుతో అరుళ్మణి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక అరుళ్మణి సూర్య హీరోగా వచ్చిన సూపర్ హిట్‌గా నిలిచిన సింగం, సింగం 2 సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా నటించారు. అలాగే పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఇటీవల నటుడు డేనియల్ బాలాజీ సైతం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని మరిచిపోక ముందే అరుళ్మణి సైతం ప్రాణాలు కోల్పోవడంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది.