JanaPadham_EPaper_TS_14-11-2024
అంతిమ లక్ష్యం ఆయనే…?
టార్గెట్ కేటీఆర్..
అన్ని దారులు అరెస్ట్ దిశగానే..?
లగచర్ల ఘటనలో పేరు ప్రస్తావన..
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్..
మరింత మందిపై నిఘా ఉంచామన్న ఐజీ
బాధ్యుల జాబితా పెరిగే అవకాశం..
త్వరలోనే మరిన్ని అరెస్టులుంటాయనే సంకేతాలు..
అటు తిరిగి., ఇటు తిరిగి.. ఆఖరుకు చేయాల్సినది అదే అనే ఇండికేషన్. ఏదైనా జరగని, ఏమైనా కాని రాష్ట్రంలో తర్వాతి తంతు కేటీఆర్ అంతే అనే సంకేతాలు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే పర్యావసనాలో., ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలనే కుట్రో., కాదంటే జరుగుతున్న పరిణామాలకు నిజంగా కర్త, కర్మ, క్రియ రామారావే అనే అనుమానాలోగానీ చూస్తున్న పరిస్థితులు ఆయనను మూసేయడానికే అనేది స్పష్టం. సర్కార్ చర్యలను నిలువరిస్తున్నాడా.., నిజంగానే ప్రజల కోసం పోరాడుతున్నాడా.. అనేది ఇప్పుడప్పుడే తేలికాదుగానీ, రాజకీయం మాత్రం రోజురోజుకు వేడెక్కుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రతిదీ ఓ యుద్ధ సన్నివేశాన్ని పోలిన సందర్భంగానే మారుతున్నది. సీఎంను ఎండగట్టే పనిలో కేటీఆర్., ఆ అడ్డంకిని తొలగించుకుంటే ఇబ్బందులుండవనే ఆలోచనలో సర్కార్ పెద్దలు., ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకునే ప్రయత్నంలో రోజుకో కొత్త రాజకీయం తెరపైకి వస్తున్నది.
======================
జనపదం, బ్యూరో
రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య జగడం ముదురుతున్నది. అవకాశం కోసం అన్నట్టుగా ఏ చిన్నది దొరికినా ఎవరికి వారుగా మలుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్కార్ ను ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్ష నేతలు పావులు కదుపుతుంటే, ఉన్న ఆ ఇద్దరుముగ్గురిని నిలువరిస్తే ఇక ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదని హస్తం కాచుక్కూర్చుంది. ఒకే విషయాన్ని రెండు కోణాల్లో చూస్తున్నట్టుగా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పని ప్రజోపయోగం కంటే ప్రైవేట్ పరమే అని ప్రతిపక్షం ఎడగడుతుండగా, తామేది చేసినా మోకాలడ్డడానికి యత్నిస్తున్నది వీళ్లు విమర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ పాలనను మాత్రం గాలికొదిలేసినట్టే అనే చెడ్డపేరును మాత్రం సర్కార్ మూటగట్టుకుంటున్నది విమర్శకులు పేర్కొంటున్నారు.
కేటీఆర్ కోసమేనా..?
రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కోసం అన్ని మార్గాలు వెతుకుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటుండడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ మాటకొస్తే తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందని, ఎవ్వరూ అధైర్యపడొద్దని, స్వయంగా కేటీఆఱ్ పేర్కొనడం కూడా ఆలోచన రేకెత్తిస్తోంది. జైలులో యోగా, మెడిటేషన్ చేసి స్లిమ్ అవుతానని, బయటకొచ్చి ప్రభుత్వంపై పడి ఎండగడతానని కేటీఆర్ మాటలతో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. జరుగుతున్న పరిణామాలు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ ఖాయమా..? లగచర్ల ఘటనలో ఆయన పేరు ప్రస్తావనకు రావడంతో రాష్ట్ర సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నదా..? అనేలా ఆలోచనను మలుపు తిప్పుతున్నది. మొన్న జన్వాడ , నిన్న మూసీ వంటి వాటి విషయంలో తృటిలో తప్పించుకున్నట్టగా భావిస్తున్న రాష్ట్ర సర్కార్ ఈ విడత లగచర్లతో మూసేయాలనే ఆలోచన, గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా అనిపిస్తోంది.
ఎండగట్టడమే కారణమా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వేదికగా అమృత్ లోని అవినీతిని ఎండగట్టడానికి చేసిన యత్నం కూడా రాష్ట్ర సర్కార్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది. దేశవ్యాప్తంగా తమను బజారుకీడ్చే పనిలో దిగిన ఆయనకు ఎలాగైనా బ్రేకులు వేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం సహజమే. అందులో భాగంగానే లగచర్ల కుట్రలో ఆయన కూడా కీలకంగా ఉన్నట్టుగా పోలీసులు పేర్కొనడంతో ఏదో జరుగబోతోందనే సంకేతాలు ఇచ్చినట్టైంది. బీఆర్ఎస్ నేతను అష్టదిగ్బంధనం చేసి మూయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోందని పార్టీ శ్రేణులు విమర్శిస్తుండగా, బాధ్యులైన వారిని ఎప్పటి వదలమని, అందులో పక్షపాతం అనే మాటే లేదని సర్కార్ పెద్దలు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా లగచర్ల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుండడం కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం చూస్తుంటే ఏ క్షణమైనా అరెస్ట్ జరిగే అవకాశాలు లేకపోలేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది.