Click to view JanaPadham-11-08-2024 E-Paper
నిన్న ముద్దు.. ఇవ్వాళ వద్దు..
టార్గెట్ మేఘా…!
బ్లాక్ లిస్ట్.. బ్లాక్ మెయిల్ బాగోతం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పనులు
టీఆర్ఎస్ సహాయంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు..
అధికారం మారగానే స్వరం మార్చిన బీఆర్ఎస్
లోపం ఎక్కడ ఉంది..?
స్వరం మారింది. పని విధానంపై అనుమానాలు కట్టలుకట్టలుగా బయటకు తన్నుకొస్తున్నాయి. అప్పుడేమో తెల్లని కాగితం వంటి అభిమానమున్న సంస్థగా కనిపిస్తే.., ఇప్పుడు మసిపూసి మారేడు చేస్తుందనేంతగా శంకించేలా తోస్తోంది. సన్నని పొర ఎందుకు తొలగింది., వీరు వారు అయినంతలోనే వారు వీరుగా ఎందుకు మారారు. మోఘా అంటే మనోడేగా అన్నంతగా ఫ్రీపబ్లిసిటీ ఇచ్చిన రోజుల నుంచి ఇప్పుడు ఆ మాటిత్తితేనే కడుపు కములుతున్న వాసనేంటి…? అవసరం తీరేదాకా మంచోళ్లుగా అనిపించిన వారు, తీరాక చెడ్డోళ్లయ్యారా.. లేదంటే ప్రజల సొమ్ము గంగపాలు అవుతోందని నిజంగానే బాధతో నిలదీస్తున్నారని భావించాలా.? ఎన్ని చేసినా పలు రాష్ట్రాల్లో ఇంకా ఆ సంస్థకే పనుల్లో అగ్రతాంబూలం దక్కుతున్నట్టు తీక్షణగా చూసే వారికెవరికైనా తెలుస్తోంది.., మరీ అదే పార్టీ నేతల్లోనే సంస్థ పనులపై అనుమానాలను పట్టించుకోని విధానాన్ని ఏమనాలి..? ఏదిఏమైనా బీఆర్ ఎస్ కు అధికారం మారగానే స్వరం మారిన తీరుపై అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు ఆ సంస్థవారంటే భలే.. భలే… అని జబ్బలు చరుచుకున్న వారు ఇప్పుడెందుకు ముక్కు విరిస్తున్నారో..?
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016లో ఈ ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ వైఫల్యమే కారణమని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడం వల్లే ప్రమాదానికి కారమని అధికారులు చెబుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఫైర్..
సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థను (పరోక్షంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ) బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, ముఖ్యమంత్రి రేవంత్ చేతగానితనం వల్లే ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోయిందని మండిపడ్డారు. హడావుడిగా పనులు చేయించడం వల్లే వాల్ కూలిందని పలువురు ఇంజినీర్లు తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో సుంకిశాలకు వెళ్లి పరిశీలిస్తామని అక్కడ ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు ఈ ప్రమాదం బయటపడకుండా దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం కోట్లాది రూపాయల ప్రజల సంపద నీట మునిగిందని మండిపడ్డారు.
పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదే..
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ప్రమాదంపై రిపోర్టు అందిన తర్వాత కాంట్రాక్టు సంస్థపై మేఘా ఇంజినీరింగ్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని ప్రకటించారు.
మరోవైపు మేఘా కృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మారినా పెత్తనం మాత్రం మేఘా కృష్ణారెడ్డిదేనన్నారు. ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేసినా ఆయనకే పనులు అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు ఇచ్చింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. మేఘాను కాపాడేందుకే సుంకిశాల ప్రమాదం ఘటనను కావాలనే దాచినట్టుగా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.
బ్లాక్ లిస్టులో పెట్టాలి..
మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తుండగానే బీజేపీ నేత కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. కంపెనీ దొంగ గ్యారెంటీలు పెట్టిందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరమే లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మేఘా అక్రమాలపై ఇంకా అంతకు మించిన ఆధారాలేం కావాలని నిలదీశారు. వెంటనే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, రాష్ట్ర సర్కార్ లేఖ ఇస్తే విచారణ చేయించే బాధ్యత తనది అని ఎమ్మెల్యే ప్రకటించారు.
సీఎం ఎందుకు సైలెంట్ అయినట్టో..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కూడా మేఘా సంస్థల మీద రేవంత్ ఆరోపణలు చేశారని, ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి సిఫార్సు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దానిపై కూడా రిటైర్డ్ జడ్జి తో కమిటీ వేశారని, ఆ జడ్జికీ మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అదీ కాకుండా సర్కార్ నుంచి ఆయనకి అందజేయాల్సిన కీలకమైన ఫైళ్లు కూడా ఇవ్వలేదని తెలుస్తోందని, ప్రభుత్వమే కమిటీని నీరు గార్చే పనిలో ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
మేఘా దర్జా..
ప్రభుత్వమే తన జేబులో ఉందని మేఘా కృష్ణారెడ్డి దర్జాగా ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా తాను ఇచ్చే కమీషన్లకు లోగాల్సిందేననే ధీమాతో ఉన్నారు. అవినీతి విచారణ ఎదుర్కొంటున్న కంపెనీకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. కొడంగల్ పనులు కూడా మేఘాకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని సమాచారం ఉందని ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. మేఘా కృష్ణా రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మేఘా మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని, అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే సుంకిశాలలో భారీ ప్రాణ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరపాలని, బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మేఘా కృషా రెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. మేఘా అవినీతిపై సోమవారం మరొక్కసారి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతానని కూడా ప్రకటించారు. ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయమంటే అక్కడ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యే వివరించారు.
ప్రజల సొమ్మును దోచుకుంటున్న గజదొంగ సంస్థ మేఘాపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కు వెనకాడమని, సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై లెటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లెటర్ ఇస్తే సీబీఐతో విచారణ చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్ట్ అవసరం.. నిర్మాణం..
హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దపూర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెటులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును మేఘాఇంజినీరింగ్ సంస్థ టెండర్ దక్కించుకుని, ఇన్ టెక్ వెల్ లో సంపు, పంపుహౌజ్, మూడు టన్నెళ్లు, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్ ను నిర్మిస్తున్నది. సుంకిశాల ప్రాజెక్ట్ ఇన్ టెక్ వెల్ పనులు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం పూర్తి అయినట్టు జలమండలి చెప్పింది. 2021జూలైలో పనులు ప్రారంభమయ్యాయని, రిజర్వాయర్ టన్నెల్ వైపున్న సైడ్ వాల్స్ 2023 జూలైలో పూర్తి అయ్యాయని జలమండలి తెలిపింది. అదే సంవత్సరం డిసెంబర్ నాటికి నాలుగు సైడ్ వాల్స్ బ్లాకుల్లో మూడు రిజర్వాయర్ ఫుల్ లెవల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని, సంపు ఫ్లోర్ లెవల్ 137 ఉండగా, 43 మీటర్ల నిర్మాణం పూర్తి చేశామని జలమండలి వివరించింది. కాగా, ఈ యేడాది జూలై 29 నుంచి మూడు రోజుల పాటు గేట్లను బిగించే పనులకు శ్రీకారం చుట్టగా నాగార్జున సాగర్ నుంచి ఒక్కసారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్ కు చేరడం, గేట్ ధ్వంసమవడం, అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలిపోవడం కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిందని జలమండలి వివరించింది.