Chandrababu | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఆ రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు దాదాపు రెండు నెలల పాటు హోరాహోరీగా ప్రచారం కొనసాగించాయి. ఇక ఎన్నికల హడావిడితో ముగియడంతో ఆయా పార్టీల అధినేతలు విదేశాలకు వెళ్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే.
ఇక జగన్ బాటలోనే చంద్రబాబు కూడా పయనించారు. చంద్రబాబు కూడా తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా పర్యటనకు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ వెళ్లారు. పరీక్షలు పూర్తయ్యాక ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు లోకేశ్ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో సహా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.