అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన
ఖాళీలను సక్రమంగా చూపలేదు..
చూపినవాటిల్లోనూ తప్పులు..
ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు..
ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి..
లేకపోతే వెళ్లిపోండి అని హూంకారం!
ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు!
ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో బదిలీల పరిస్థితి
హైదరాబాద్: ఖాళీలను సక్రమంగా చూపలేదు.. చూపినవాటిల్లోనూ తప్పులు.. ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు.. ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని హూంకారం! ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు! ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో బదిలీల పరిస్థితి. గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా కొనసాగుతున్నది. ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ ఇష్టారాజ్యం
సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా.. మొదటి నుంచి 317 బాధితులకు న్యాయం చేస్తామని, స్పౌజ్, ఇతర మెడికల్ కేసులను పరిష్కరిస్తామని, అంతా కూడా ఆన్‌లైన్ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు. కానీ, ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి. బలవంతంగా బదిలీ చేయాల్సివస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ సొసైటీ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికిరాత్రే సీనియర్ టీచర్లతో లిస్ట్ విడుదల చేసి, మరుసటి రోజే కౌన్సెలింగ్‌కు రమ్మని పిలవటంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు. 317 జీవో, స్పౌజ్ కేసులను కూడా సొసైటీ పరిగణనలోకి తీసుకోవటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక, అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్ జాబితాలో పేర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని, సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రణాళిక లేకుండానే..
సొసైటీ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. అన్ని సొసైటీలు, శాఖల్లో ఆన్‌లైన్ బదిలీలే జరుగుతుండగా, సోషల్ వెల్ఫేర్ సొసైటీ మాత్రం ఆఫ్‌లైన్‌కు మార్చటంపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారాభవన్‌లో బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ రెండు రోజులుగా కొనసాగుతున్నది. బుధవారం సైతం గ్రేడ్-2 ప్రిన్సిపాల్స్, డిగ్రీ కాలేజీ స్టాఫ్ మినహాయించి మిగతా అన్ని క్యాడర్లలో అవసరానికి మించి డిస్‌లొకేట్ అయినవారికి కౌన్సెలింగ్‌కు పిలిచారు. అందులో సొసైటీలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. కానీ ఎక్కడా ఒక క్రమపద్ధతి లేకుండా అధికారులు కౌన్సెలింగ్‌ను ఇష్టారాజ్యంగా నిర్వహించటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్లవెంట, చెట్ల కింద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గంటల తరబడి పడిగాపులు కాశారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళా టీచర్లు, దివ్యాంగ టీచర్ల అవస్థలు అంతాఇంతాకాదు. కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ పొందిన సిబ్బందికి పోస్టింగ్స్ ఆర్డర్స్‌ను ఇవ్వకుండానే, తర్వాత పంపిస్తామంటూ సొసైటీ అధికారులు చెప్పడం కొసమెరుపు.
రాత్రికి రాత్రే మారిన జోన్లు
బదిలీలకు ప్రకటించిన ఖాళీల జాబితా తప్పుల తడకగా ఉన్నదని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఖాళీలను చూపించటం లేదని మండిపడ్డారు. ముందుగా ఒక జాబితాను ప్రకటించి, తాజాగా మరో జాబితాను విడుదల చేయటంపై నిప్పులు చెరిగారు. అందులోనూ రాత్రికి రాత్రే జోన్లు మారిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు.. హాల్‌లోనే కౌన్సెలింగ్‌ను అడ్డుకొని ‘వీ వాంట్ జస్టిస్’ అని ఆందోళన చేపట్టారు. దీంతో ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు రంగంలోకి దిగారు. ‘గంట నుంచి చూస్తున్నాం. ఆందోళన చేసేవాళ్లు హాల్ నుంచి బయటకు వెళ్లిపోండి. లేదంటే బలవంతంగా పంపించేస్తాం’ అని పోలీసులు బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరుపై భగ్గుమన్న టీచర్లు.. బదిలీ కోసం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులతో బెదిరిస్తారా అని సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన ఉధృతం చేయటంతో ఎట్టకేలకు దిగొచ్చి ఉపాధ్యాయులు కోరిన ఖాళీల జాబితా చూపుతూ కౌన్సెలింగ్ ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 317 డిస్‌లొకేట్ టీచర్లకు న్యాయం చేయటంతోపాటు, వేకెన్సీ జాబితాలలో తప్పులను సరిచేశాకే బదిలీలు నిర్వహించాలని పట్టుబట్టారు. అర్ధరాత్రి దాటినా ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది.
10వ తారీఖు వచ్చినా జీతాలు పడలేదు
జూలైలో 10వ తేదీ గడిచినా ఇప్పటికీ వేతనాలు వేయలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సొసైటీల్లో ముందుగానే వేతనాలను చెల్లిస్తున్నా, తమ సొసైటీలో మాత్రం ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. సొసైటీ ఉన్నతాధికారుల అలసత్వం వల్లే ఇదంతా జరుగుతున్నదని మండిపడుతున్నారు. వేతనాలను ఒక నిర్ణీత తేదీ లేకుండా ప్రతి నెలా ఏదో ఒక తేదీన వేస్తున్నారని, ఫలితంగా సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు