న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం (Tech layoffs) కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్టులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగుల తొలగిపులో పోటీపడుతున్నాయి. ఇలా ఉద్యోగులను తీసేస్తున్న సంస్థల జాబితాలో టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 271 టెక్ కంపెనీలు 80 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికిపైగా తమ ఉద్యోగులు కోల్పోయినవారు ఉన్నారని layoffs.fyi ప్రచురించిన నివేదిక తెలిపింది. దీనిప్రకారం టెక్నాలజీరంగలోని 50 కంపెనీల నుంచి ఒక్క ఏప్రిల్‌లోనే 21,473 మంది ఉద్వాసనకు గురయ్యారు.
జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 703 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఏప్రిల్‌లో యాపిల్ కంపెనీ 614 మందిని తొలగించగా, అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలపై వేటువేసింది. ఇంటెల్ ప్రధాన కార్యాలయంలోని 62 మందిని, బైజూస్ సుమారు 600 మందిని, టెస్లా అత్యధికంగా 14 వేల మందిని, హెల్తీఫైమ్ దాదాపు 150 మందిని, ఓలా క్యాబ్స్ 200 మందిని, నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించాయి.
ఇక ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను విప్రో ప్రకటించిన తాజా ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సంస్థ ఉద్యోగులు 2,34,054గా ఉన్నారు. ఏడాది క్రిందట 2,58,570 మంది ఉండగా, 24,516 మంది తగ్గారు. అలాగే దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 3,43,234 నుంచి 3,17,240కి పడిపోయారు. ఏడాది వ్యవధిలో 25,994 మంది దిగారు. దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థ టీసీఎస్‌లో ఈ మార్చి 31 నాటికి 6,01,546 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాది మార్చి ఆఖరుతో పోల్చితే 13,249 మంది తగ్గిపోయారు.