Monday, December 30, 2024
HomeTelanganaTelangana Cabinet | జూన్ 2న తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను స‌న్మానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం

Telangana Cabinet | జూన్ 2న తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను స‌న్మానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం

Telangana Cabinet | హైద‌రాబాద్ : ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేండ్లు అవుతున్న సంద‌ర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ వేడుక‌ల నిర్వ‌హ‌ణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాల‌ని కేబినెట్ తీర్మానించింది. ఈ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించటంతో పాటు తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించుకునేందుకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌పై కేబినెట్‌లో చర్చ జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయటంతో భారీగా మార్పు తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా స్కూల్స్ మెయింటెనెన్స్ ను ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది.

జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జూన్ 10 లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. పాఠశాలలు తెరిచేలోగా పెయింటింగ్స్, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ ) ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినేట్ సిఫారసు చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేపట్టినా తదుపరి ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ ప్రస్తావించిందని, మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఏ చేసిన సిఫారసును మంత్రివర్గం ప్రత్యేకంగా గుర్తించింది. అందుకే అత్యవసరంగా చేపట్టాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు చేయించాలని, ఎన్డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలకు వీటిని అప్పగించి, నెల రోజుల్లో రిపోర్టులు అందేలా చూడాలని అధికారులను కోరింది. ఈలోపు చేపట్టాల్సిన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టు కంపెనీలతోనే చేయించాలని నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగితే బ్యారేజీకి ఇబ్బంది లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని, అవసరమైన తాత్కాలిక చర్యలు చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు