జనపదం – శనివారం -24-08-2024 E-Paper
కేబినెట్, నామినేట్ ఓకే..? పదవుల పంపకం..
అధిష్టానం క్లియరెన్స్..!
టీపీసీసీగా మహేశ్ కుమార్ గౌడ్..?
పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్…
ఆరుగురికి మంత్రి పదవులు..!
ఢిల్లీలో రేవంత్ విస్తృత చర్చలు, సమాలోచనలు..
ఢిల్లీలో పదవుల పంపకం రాష్ట్ర పార్టీలోని పదవుల పంపకం ఢిల్లీ కేంద్రంగా కొలిక్కి వచ్చాయి. ఊరిస్తూ, ఉసూరుమనిపిస్తూ వచ్చిన ఆశల పల్లకీ ఎట్టకేలకు రేవుకు చేరింది. బెర్త్ దక్కినట్టుగా సమాచారం ఉన్నవారు సంబురపడుతుండగా, ఇంకా అధికారికంగా వెలువడలేదుగా అని ఆశావహులు ఆత్రుతగా గడుపుతున్నారు. ఎట్టకేలకు సీఎం అండ్ టీంకు ప్రాధాన్యత పోస్టులు దక్కే అవకాశాలున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టీపీసీసీ పీఠం మహేశ్ కుమార్ గౌడ్ ను వరించేందుకు సిద్ధమైనట్టు దాదాపుగా తేలడంతో మిగతావారు మౌనం దాల్చుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చి అధికారం చేపట్టే దిశగా నడిపించిన రేవంత్ కు అధిష్టానం కూడా అదేస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చి పదవుల పంపకంలో చిన్నబుచ్చుకోకుండా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్, కేబినెట్ కూర్పు కూడా కొలిక్కి రావడంతో ఇక ప్రకటనే తర్వాయి అని అంతా ఎదురుచూస్తున్నారు.
=======================
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ వాతావరణం, ప్రతిపక్ష పార్టీల అప్రకటిత వార్., రుణమాఫీ ఫీడ్ బ్యాక్ వంటి ఎన్నో అంశాలపై చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో పీసీసీ మార్పు, కేబినెట్ పదవుల పంపకం, నామినేటెడ్ పోస్టుల కేటాయింపు పై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆశావహులను ఊరించే విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులు పంచి అసంతృప్తుల జాడలేవి కనిపించకుండా చర్యలు తీసుకోవాలని మూకుమ్మడిగా డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది.
అధిష్టానం క్లియరెన్స్..!
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు పావులు చకచకా కదులుతున్నాయి. రాష్ట్రంలో పదవుల పంపకానికి కాంగ్రెస్ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అసంతృప్తులు పెరుగుతున్నారనే ఆలోచనతో ఓ కొలిక్కి తెచ్చినట్టు వినికిడి. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన సీఎం తిరుగు ప్రయాణం అయ్యారు. కేబినెట్ లో మరో ఆరుగురికి అవకాశం కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కాగా, ముఖ్యమంత్రిని పలుమార్లు కేబినెట్, నామినేటెడ్, పీసీసీ నియామకాల విషయమై చర్చించడానికి ఢిల్లీకి పిలిచినా అప్పటి అత్యవసరాల మేరకు వాయిదాపడుతూ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఆగస్టు 15వ తేదీన కూడా సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ఇక తేల్చుకుని వస్తారని భావించినా నిరాశే మిగిలింది. తాజాగా గురువారం హస్తినా నుంచిపిలుపు రావడంతో రాత్రికి రాత్రే వెళ్లిన ముఖ్యమంత్రి శుక్రవారమంతా బిజీబిజీగా గడిపారు. కేబినెట్, నామినేటెడ్, పీసీసీ నియామకాలపై కంక్లూజన్ కు వచ్చారు. అధిష్టానం గతంలో మాదిరిగా నాన్చకుండా తేల్చి మరీ పంపినట్టు తెలిసింది.
పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్…
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఇప్పటి వరకు జరగలేదు. వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమం తాజాగా శుక్రవారంతో ఫైనల్ కాగా, రాష్ట్ర మంత్రి వర్గంలో ఆరుగురికి కేబినెట్ బెర్త్ లు కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామచంద్రనాయక్ లు మంత్రులుగా అవకాశం లభించినవారుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలతో సీఎం రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, ఇతర పదవులు కేటాయింపులపై విస్తృతంగా చర్చలు జరిపి కొలిక్కి తెచ్చారు.
క్యాబినెట్ లో ‘సామాజిక’ న్యాయం..
ఎట్టకేలకు ముఖ్యమంత్రి పంతం నెగ్గించుకున్నారు. అనుకున్న వారికి అనుకున్నట్టుగా పదవులు ఇప్పించుకుని తన బలాన్ని మరో మారు చాటారని పార్టీలోని ఓ వర్గం కితాబిస్తోంది. కాగా, కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం పాటించారని కూడా మెచ్చుకుంటోంది. కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమర్ గౌడ్ టీపీసీసీగా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుండడంతో కేబినెట్ లో సామాజిక వర్గాలకు మరింత సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలలోనే వరంగలలో సభ పెట్టే యోచనలో నేతలు ఉండగా, ఈ గ్యాపులోనే కేబినెట్ తో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించారు.