Sunday, December 29, 2024
HomeTelanganaTelangana Cabinet | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి.. సీఎం రేవంత్ ఆదేశాలు

Telangana Cabinet | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి.. సీఎం రేవంత్ ఆదేశాలు

Telangana Cabinet | హైద‌రాబాద్ : ధాన్యం కొనుగోళ్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలంగాణ‌ కేబినెట్ నిర్ణ‌యించింది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాల‌ని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలి. అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. అటువంటి పరిస్థితి ఉన్న చోట జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల విభాగం అధికారులకు నివేదించి కొనుగోళ్లు జరిగేలా చూడాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వేగంతో మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడ సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చిన కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులు జవాబుదారీగా ఉండాలని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో సన్న రకాల వరి సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి ఎమ్మెస్పీపై రూ.500 బోనస్ చెల్లించాలని కేబినెట్‌లో నిర్ణయం జరిగింది. వానాకాలం పంటకు యాక్షన్ ప్లాన్‌పై కేబినెట్‌లో చర్చ జరిగింది. గత ఏడాది వానా కాలంలో 1.44 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వర్షాలు పడుతాయనే అంచనాలతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున వచ్చే ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాల పంటలు సాగువతాయని అంచనా. వానాకాలం పంటకు కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం అధికారులకు సూచించింది.

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలకు రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ఇందుకు సంబంధించి వీడియోలు తయారు చేయించి, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. సినిమా థియేటర్లలోనూ ప్రకటనలు వేయించాలి. విత్తనాల అమ్మకంపై ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి. ఏయే విత్తన కంపెనీలు ఏయే జిల్లాల్లో రైతులకు విత్తనాలు అమ్ముతున్నాయో వ్యవసాయ శాఖ రికార్డు చేయాలి. విత్తనాలు అమ్మే వ్యాపారులు ఏయే రైతులకు అమ్మారో రికార్డు చేయాలి. విత్తనాల సేల్స్ కు సంబంధించిన లిస్ట్ వ్యవసాయశాఖ వద్ద ఉండేలా చర్యలు చేపట్టాలి. నకిలీ విత్తనాల అమ్మకం జరిగితే సంబంధిత కంపెనీలను జవాబుదారీగా చేయాలి అని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు