Sunday, December 29, 2024
HomeTelanganaCabinet Meeting | హై(డ్రా)పవర్స్..

Cabinet Meeting | హై(డ్రా)పవర్స్..

Janapadham _EPaper_21-09-2024

హై(డ్రా)పవర్స్..-

అప్పుడే హిమాయత్ సాగర్ వైపు బుల్డోజర్లు..
83 కట్టడాలకు చెక్ పెట్టే వ్యూహం..
సన్న వడ్లకు రూ.500 బోనస్
ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు
మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్
ఎస్ఎల్ బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు ఆమోదం
రూ.4637 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం..
పలు పేర్ల మార్పునకు గ్రీన్ సిగ్నల్..

ఉన్న బలానికి అదనం తోడైనట్టు.., దూకుడుకు మరింత శక్తిని అందజేసినట్టు., ఆటంకాలకు అవకాశం లేకుండా, అవకాశాలను ఆపేలా ఉండకుండా.. హైడ్రా ఇప్పుడు మరింత హైపవర్ గా రూపాంతరం చెందింది. ఆక్రమణలు, అక్రమాల అంతుచూడడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ వ్యవస్థను కేబినెట్ ఇంకా బలీయంగా మార్చింది. ఇన్నాళ్లు ‘ఆధారపడిన’ తీరు నుంచి ఇప్పుడు ప్రత్యేక విధివిధానాలతో చెలరేగిపోయేలా తయారు చేసింది. మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు అతీత శక్తులను అప్పగించడానికి నిర్ణయించడంతో పని మరింత సాఫీగా, ఆలస్యానికి ఆస్కారం లేకుండా చేయడానికి మార్గం సుగమం చేసినట్టైంది. అడ్డూ అదుపు లేకుండా సాగిన కబ్జాల పర్వానికి చరమగీతం పాడాల్సిన సమయాన్ని గుర్తు చేస్తూ ఎవరిపై డిపెండ్ కాకుండా, ఎక్కడా డిలే జరగకుండా తన పనిలో తాను చొచ్చుకెళ్లేందుకు అతీత శక్తులను కేబినెట్ ఆపాదించింది.

=====================

జనపదం, బ్యూరో

హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సుమారు మూడు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం వివిధ అంశాలపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా హైడ్రాను మరింత బలోపేతం చేసేవిధంగా పలు అధికారాలను కట్టబెట్టింది. ఓఆర్ఆర్ కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రా కు పూర్తి అధికారాలను అప్పగించింది. అలాగే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన హైడ్రాకు మున్ముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్న లక్ష్యంతో మంత్రివర్గం కూలంకషంగా చర్చించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో 150 మంది అధికారులను, 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శివారులోని 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఓఆర్ఆర్‌‌కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని, అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల 27 అర్బన్‌, లోకల్‌ బాడీలు ఉన్నాయి. వాటిల్లో 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో విలీనం చేయాలని నిర్ణయించమన్నారు.

ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ కు కమిటీ..
ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ ఉంటుందని వివరించారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంటారని, వీటన్నిటితో పాటూ పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తిస్తుందని పొంగులేటి చెప్పారు.

లాజిస్టిక్ పార్క్..
మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలోని 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. అదీ కాకుండా ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు చేశారు. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వివరించారు.

సన్నాలకు రూ.500 బోనస్..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇది కూడా తీర్చనున్నట్టు చెప్పారు. మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, వాటిలో కోఠి ఉమెన్స్ కాలేజీ పేరును చాకలీ ఐలమ్మగా మార్చుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా, హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వివరించారు.

అనంతరం ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్ బీసీ టన్నెల్ వర్క్స్ పనుల కోసం రూ.4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చామన్నారు. రెండేళ్లలో ఈ టన్నెల్ పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ టన్నెల్ చారిత్రాత్మకం కానుందని, శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణ వాటర్ తీసుకుని అవకాశం ఉంటుందన్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ప్రతినెలా 400 మీటర్లు టన్నెల్ వర్క్స్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక జనవరి నుంచి రేషన్ కార్డ్ లకు సన్న బియ్యం ఇవ్వనున్నట్టు చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్ బీసీపై గతంలో తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తే అప్పటి సీఎం కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. దీనిని ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు టన్నెల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తుందన్నారు. యేటా రెండు పంటలకు కాలువ ద్వారా ఎస్ఎల్ బీసీ నీళ్లొస్తాయన్నారు. ఇది పూర్తి అయితే తనకు, కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందో అన్న రాజకీయ దురుద్దేశ్యంతోనే కేసీఆర్ పూర్తిచేయలేదని విమర్శించారు. ఈ ఎస్ఎల్ బీసీతో నల్గొండ జిల్లాకు పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతుందని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు