*మొసమర్తలేదు..
గాలి చంపేస్తోంది.. *
ప్రమాదపుటంచున నగరాలు
హైదరాబాద్ సహా వరంగల్, నిజామాబాద్ లో డేంబర్ బెల్స్
ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) గరిష్ట స్థాయి 50
రాష్ట్రంలో పలుచోట్ల 150కి మార్క్ దాటిన వైనం
మాస్క్ ధరించాలంటున్న నిపుణులు..
==============
మొస తీసుకునేడు కష్టమైతాంది. ముక్కులు పూడ్చుకపోతున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న గాలిలోకి ఇప్పుడు దీపావళి పుణ్యానా మరింత చెత్త చెదారం వచ్చి చేరడంతో ఇంట్లున్నకాడ్నే ఇబ్బంది అవుతున్నది. విచ్చలవిడిగా బాంబుల మోతలతో ఓ వైపు శబ్దకాలుష్యం మితిమీరిపోగా, మరోవైపు పొగతో గాలంతా గాయిగాయి అయిపోయింది. దీంతో ముసలిముతక, పిల్లాజెల్లా ఆగమాగం అవుతున్నారు. శ్వాసతీసుకునేందుకు కష్టపడుతూ ఆయాసపడుతున్నరు. దేశరాజధాని ఢిల్లీలో బాణాసంచాపై బ్యాన్ పెట్టిన బాగుపడిన దాఖలాలు లేకపాయె. ఇప్పుడు రాష్ట్ర రాజధాని లో డేంజర్ బెల్స్ మోగుతుండగా, మనమేం తక్కువు తిన్నామని వరంగల్, నిజామాబాద్ వంటి నగరాలు కూడా ఫుల్ కాలుష్యంలో కూరుకుపోయాయి. మేల్కొనకపోతే శాశ్వతంగా నిద్రపోయే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
=============
జనపదం, బ్యూరో
రాష్ట్రంలో గాలి కాలుష్యమవుతున్నది. వాహనాలు, పరిశ్రమలు ఇప్పటికే పొగ పెడుతుంటే, దీపావళి బాణాసంచాతో గండానికి మరింత సెగ వేసినట్టయింది. ప్రధానంగా రాష్ట్ర రాజధానితో పాటు వరంగల్, నిజామాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో తగ్గుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఢిల్లీ తరహాలోనే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం నగరవాసులను కలవరపెడుతోంది. ఈ కాలుష్యంతో దశాబ్దకాలంలో నగరంలో 6 వేల మందికి పైగా చనిపోయాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి.
నగరంలో దీపావళితో అధికంగానే..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, అబిడ్స్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. గతంలో గంట సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ వద్ద 92, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదైంది. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏక్యూఐ 128 ఉండగా, పార్టిక్యులేట్ మ్యాటర్ స్థాయి 2.5 గ్రాములు ఉంది. వరంగల్‌లో అత్యధికంగా ఏక్యూఐ 143 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర నమోదయింది. వ్యర్థాలకు మంట ప్రాణాలకు పొగతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కాలుష్య ప్రాంతాలుగా మసకబారాయి. గాలి చాటున గత్తర దూసుకు వస్తోందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. గాలి నాణ్యతకు సంబంధించి వివధ సంస్థల అధ్యయనంలో సంచలనాలు వెలుగుచూశాయి.
ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే గాలి గాడి తప్పినట్టే..
తెలంగాణలో ఇప్పుడు చాలాచోట్ల 100 నుంచి 150 మార్క్ ను టచ్ చేసినట్లు తేలింది. ఏక్యూఐ స్థాయి 50 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత ‘పూర్’క్వాలిటీ, 100 నుంచి 150 వరకుంటే ‘అన్హెల్దీ’, 150 నుంచి 200 రికార్డయితే డేంజర్.. ఇక AQI మూడు వందల రేంజ్‌లోకి వెళ్లితే ప్రాణాలకు మూడినట్టే అని తెలుస్తోంది. కలుషితమైన గాలితో శ్వాస సంబంధ వ్యాధులతో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదయయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వ్యక్తిగతంగా ప్రాణాలు కాపాడుకోవాలంటే కరోనా రూల్ పాటించాలనీ, మాస్క్ ధరించాలని నిపుణులు కీలక సూచనలు చేశారు.