Click to view: JanaPadham_EPaper_TS_12-09-2024
మళ్లీ.. ఢిల్లీ..?!
నేడు మంత్రివర్గ ఖరారు..?
మంత్రివర్గ విస్తరణపై ఆశలు
ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడు
నేడు అధిష్టానంతో చర్చలు
ఆశావాహుల్లో ఉత్కంఠ
వరదసాయంపై ప్రధాని, హోం మంత్రిని కలవనున్న సీఎం
మళ్లీ ఢిల్లీ బాట. పదవుల పంపకానికో., నిధులు గుంజడానికో గానీ సీఎం అండ్ టీం హస్తినా పయణం. వాళ్లటు వెళ్లడం., వీళ్లు విహరించడం… ఆకలి తీరదు.., ఆశ చావదు అన్నట్టుంది పరిస్థితి. అక్కడ తేల్చేదెప్పుడో., ఇక్కడ తేలేదెన్నడోగానీ ఆశల పల్లకీలో కాలం వెల్లదీయడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారింది. ఇప్పటికే పీసీసీ చీఫ్, నామినేటెడ్ నియామకాలు పూర్తి అవడంతో ఇప్పుడంతా మంత్రి వర్గ విస్తరణపైనే చూపులు. సీఎం వెంటే డిప్యూటీ, టీపీసీసీ వెళ్లడంతో ఈ సారి ఏదో ఓటి తెగ్గొట్టుకుని వస్తారనే ధీమాతో ఉన్న ఎమ్మెల్యే విచిత్ర పరిస్థితి. సది నెలల నిరీక్షణకు ముగింపుగా, పార్టీ బలోపేతానికి చేసిన కృషికి బహుమతిగా జాబితాలో పేరు ఉండకపోతుందా.., ఇప్పటికైనా ఫేట్ మారకపోతుందా.. అనే కక్కలేక, మింగలేక వెళ్లదీస్తున్న చూపులన్నీ అధిష్టానం వైపే తిప్పిన సమయమిది.
జనపదం, బ్యూరో
==========================
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై చర్చ మళ్లీ మొదలైంది. ఊరిస్తున్న మంత్రివర్గం కూర్పుకు సీఎం, టీపీసీసీ కీలక నేతలతో కలిసి అధిష్టానం తుది మెరుగులు దిద్దేందుకు సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియకు ముగింపు పలికి మంత్రి పదవులపై ఆశావాహుల్లో పెరుగుతోన్న ఉత్కంఠ, ఏఐసీసీపై పెరుగుతోన్న ఒత్తిడికి చెక్ పెట్టాలని అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికై ఆ హోదాలో తొలిసారిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నేడు ఏఐసీసీ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం హస్తీనా బాటపట్టారు. టీపీసీసీ చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎంలందరూ ఒకేసారి, ఒకేచోట, అగ్రనేతలతో భేటీ కానున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో నేడు సాయంత్రం అగ్రనేతలతో మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతారనీ, దానికి హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
నిరీక్షణకు ముగింపా..?
నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది. దీంతో పెద్దల చూపు ఎవరిపై ఉంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదీలావుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలలు పూర్తి కావస్తోన్నా. ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్ధాయిలో జరగలేదు. గతేడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కీలక హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఇదీలావుంటే కీలక శాఖలతో అసంపూర్తిగా ఉన్న కేబినెట్‌లో చోటు కోసం పలువురు సీనియర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం రాష్ట్ర, జాతీయ నేతల ద్వారా అధిష్టానం ఆశీస్సులు పొందేలా సర్వశక్తులొడ్డుతున్నారు. వీరిలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ (ఆదిలాబాద్), వినోద్ (బెల్లంపల్లి), వెల్మ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), రెడ్డి సామాజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడుస), సుదర్శన్ రెడ్డి (బోధన్),మల్ రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), రాంమోహన్ రెడ్డి (తాండూర్) ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ,అజారుద్దీన్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే వీరిలో ఎవరికి పదవులు వరిస్తాయి..? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోననే చర్చ జరుగుతున్నది.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు కేబినెట్ లో ఛాన్స్ పక్కా అన్న ధీమాతో ఉన్నారు. తనకు హోంమంత్రి పదవి కూడా వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందని.. విస్తరణలో తనకు చోటు తప్పనిసరిగా దక్కుతుందని ఆయన అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మైనార్టీ నుంచి మంత్రివర్గంలో ఇంత చోటు దక్కలేదు. దీంతో ఈ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లో ఒకరు లేదా ఇద్దరికీ ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇటు ముదిరాజ్ సామాజికవర్గం నుంచి శ్రీహరికి కచ్చితంగా మంత్రి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు బెర్త్ ఖరారైనట్లు సమాచారం.
వరద సాయం కోసం..
ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదలతో భారీ ఆస్తి, పంట, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి అత్యధిక విపత్తు నిధులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో కలిసి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు.ఇప్పటికే సీఎం కార్యాలయం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని స్పంద్రించింది. పీఎం అపాయింట్మెంట్ ను కోరింది. ఇందులో రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై నివేదిక సమర్పించనున్న సీఎం రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు.