వేటక్కడ… ఆటిక్కడ..
రాష్ట్రంలో కూల్చే కార్యం.., కేంద్రంతో వాటాల బేరం..
ఢిల్లీలో బిజిబిజిగా సీఎం రేవంత్…
బీజేపీ పెద్దలకు అర్జీలు.. అభ్యర్థనలు..
ముఖ్యమంత్రి తీరుపై మిశ్రమ స్పందన..
దేని దారి దానిదే., ఎక్కడాట అక్కడే. ఆన్నుంచి రాబట్టుకునే వాటిలో కాంప్రమైజ్ అయ్యేది లేదు., ఇక్కడ చేయాలనుకున్న దాంట్లో వెనక్కి తగ్గేదే అంతకన్నా లేదు. ఒక్కో చోట ఒక్కో తీరు. అయినా స్థానికంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కా., బయటకు వెళ్తే కేంద్రం నుంచి పొందే హక్కులను, అవసరాలను సాధించుకునే కాంగ్రెస్ సర్కార్ మాదిరి. పరకాయ ప్రవేశం చేస్తూ సాగిస్తున్న పాలన తీరిది. కూల్చడం.., కాల్చడం.., పేర్చడం.., నిలబెట్టుకోవడం.. ఏం చేసినా మా రాజధానిలో మా ఇష్టం. కావాల్సినవి తెచ్చుకోవడం, అవసరమున్న వారిని కలుస్తూ అర్జీలు, అభ్యర్థనలు ఇస్తూ తెచ్చుకునే ప్రయత్నం చేయడం దేశరాజధానిలో తప్పని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రమంతా హైడ్రా వ్యవహారంలో అట్టుడుకుతున్న వేళలో అమిత్ షా తో మీటింగ్ నేలమట్టాల ఎపిసోడ్ కు కాస్త విరామం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుందే తప్ప పండగ తర్వాత మళ్లేమవునో.. అనే టెన్షనే అందరిలో.
జనపదం, బ్యూరో
ఒకవైపు రాష్ట్రంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుండగా ఢిల్లీలో నిధుల కోసం వేట ముమ్మరమైంది. హైడ్రా తమ నాశనానికే తీసుకొచ్చారని ప్రజలంతా దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. అయినా పట్టువిడవని రేవంత్ సర్కార్ ముందుకే తప్ప వెనక్కి వెళ్లేదే లేదని పోతూనే ఉంది. దీంతో ప్రజలంతా ఏడుపులు పెడబొబ్బలతో న్యాయం కోసం ఎవరికి తోచిన వారి దగ్గరకు వారు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. అసలు ఓ లెక్కా పత్రం లేకుండా ఇష్టారీతిగా కూల్చివేతలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన దరిమిలా కాస్త వెనక్కి తగ్గినట్టే తగ్గింది. అదే సమయంలో మంత్రి సురేఖ ఇష్యూతో ప్రస్తుతానికి టాపిక్ సైడ్ ట్రాక్ అయింది. స్తబ్దుగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న, నేడు జరిగే ఈ రివ్యూలో ఎన్నో విషయాలు, మరెన్నో కష్టనష్టాలపై చర్చించారు.
రాష్ట్రంలో కూల్చే కార్యం.., కేంద్రంతో వాటాల బేరం..
రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కూల్చివేత పర్వాన్ని సాగిస్తూ, కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాల కోసం బేరాలు కుదుర్చుకుంటున్నది. ఢిల్లీలో ఉన్న సీఎం అమిత్ షా సహా, కేంద్రంలోని పలువురు ముఖ్యమైన మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితి, యేండ్లుగా రావాల్సిన పెండింగ్ నిధులు, బీఆర్ఎస్ సర్కార్ దుర్వినియోగంతో రాష్ట్రం దయనీయత అంతా వివరిస్తూ ఖజానా పూడ్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కేవలం మూసీ సుందరీకరణకే లక్షయాభైవేల కోట్లు కేటాయించి, మరే ఇతర అవసరాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటూనే కేంద్రంతో మాత్రం చిన్నాచితన రావాల్సిన వాటిని కూడా వదలం అనే రీతిలో వ్యవహరిస్తున్న తీరుకు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు కలోగంజో తాగి, రెక్కలు ముక్కలు చేసుకుని చేసుకున్న నిర్మాణాలపై కన్నుకుట్టి చేస్తున్న రాష్ట్ర సర్కార్ తీరు ఏ మాత్రం సరికాదని ఎందరు మొత్తుకున్నా పట్టింపు మాత్రం లేకపోగా, రెట్టించిన ఉత్సాహంతో అన్నట్టుగా సాగడాన్ని మరచిపోలేని జనం ఢిల్లీలో మాత్రం రాష్ట్రానికి ఏదో ఉద్దరించడానికి శ్రమిస్తున్నట్టు సీఎం చేస్తున్న ఫోజులను కొట్టిపారేస్తున్నే తప్ప నిజంగా నమ్మడం లేదు.
ఇక్కడ అపరిచితుడు.. అక్కడ రామానుజం..
కూల్చివేతలపై కనీసం కూడా స్పష్టత లేకుండా చేస్తున్న తీరును జనమంతా ఈసడించుకుంటున్నారు. ఆడిందే ఆటమాదిరిగా రెచ్చిపోయిన అధికారులు పూనకాలు వచ్చిన వారిగా నేలమట్టం చేశారని శాపనార్థాలు పెట్టిందికూడా తెలిసిందే. అవేవి పట్టించుకోని సీఎం కనీసం ప్రజలను ఉద్దేశించి మాట్లాడానికి కూడా సుముఖత చూపలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యవహారం కూల్చివేతలు, హైడ్రా తీరు., ప్రజలు దయనీయ గాథలు.. ఇవేవి పట్టని తీరుగానే సాగుతున్నది. ఇదంతా చూసి ఆయన ప్రవర్తన ఓ అపరిచితుడి మాదిరిగా మారిందని అనేవారు లేకపోలేదు. అదే సమయంలో హస్తినాలో కేంద్రం పెద్దల వద్ద మాత్రం రాముడు మంచిబాలుడి మాదిరి బిల్డప్ లో ఉన్నారంటున్నారు. నిధులు రాబట్టుకొని రావడం, పెండింగ్ లో ఉన్న వాటిని సాధించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్న ఆయన తీరు రామానుజంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో అపరిచితుడు., కేంద్రంతో రామానుజం.. ఇది రేవంత్ వ్యవహారం అంటున్నారు.