న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగినప్పటికీ తెలంగాణలో అలాంటిది ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు కూడా విమర్శించడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి ఆహ్వానం పలకడానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వేడుకలు జరిగాయని.. ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదనేదే తమ విధానమని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు గుర్తుకువస్తాయని, అందుకే రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ పనిని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌కు, కళాకారులకు అప్పగించామన్నారు. రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే పనిని అందెశ్రీకి అప్పగించామని.. ఎవరితో సంగీతం చేయించుకుంటారో తమకు సంబంధం లేదన్నారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం అందిస్తున్నామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతిక నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామని మరోసారి స్పష్టం చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ జరుగుతున్నదని చెప్పారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తమ ప్రమేయం లేదని తెలిపారు. కొన్ని వస్తువులు పోయాయన్న ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని.. తన పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగులు చేయదన్నారు. ఇక రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెప్పారు. విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఎలాంటి లోటు లేకుండా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అనుకోని అవాంతరాలతో ఎక్కడైనా తాత్కాలికంగా సరఫరా నిలిస్తే, దాన్ని రిపేర్ చేసే వరకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.