Saturday, December 28, 2024
HomeTelanganaNominated Posts | హస్తినాలో అదృష్ట రేఖ..?!

Nominated Posts | హస్తినాలో అదృష్ట రేఖ..?!

Click to view: Janapadham_EPaper_TS_22-10-2024

హస్తినాలో అదృష్ట రేఖ..?!

హైకమాండ్ చేతిలో జాతక చక్రం..

ఊరిస్తున్న నామినేటెడ్..
యేడాది కావొస్తున్న ఎటూ తేలని భవితవ్యం…
ఊహల్లోనే ఉసూరుమంటున్న ఆశావహులు..
కాంగ్రెస్ లో చాపకింద నీరులా అసంతృప్తులు..
కొద్దికొద్ది పదవులు కేటాయింపులతో తీవ్ర నైరాశ్యం..

టీవీ ఇక్కడ., రిమోట్ హస్తినాలో. పాలన స్థానికంగా., పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైకమాండ్ కనుసన్నల్లో. ఏదైనా చేయాలంటే అనుమతి పత్రం తప్పనిసరి. అప్రూవల్ కోసం అక్కడికి వెళ్లడం., సరే అనిపించుకుని వద్దామనే సరికి ఏదోఒక అడ్డంకి ఇక్కడ నుంచి స్వాగతం పలకడం. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు., సుమారు యాడాది కావొస్తున్నది. ఒక్క అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నది నామినేటెడ్ వ్యవహారం. పార్టీ అధికారంలోకి వచ్చిందని సంబురంతో ఎగిరి గంతేసిన ఆశావహులకు ఆశానిపాతంగానే మారింది. అదిగో వచ్చే అనుమతి పత్రం.., ఇదిగో వచ్చే పదవి వరం అన్నట్టుగా ఊరిస్తున్న వారి మాటలతో వీరంతా ఉసూరుమంటున్నారు. జాతకాలన్నీ ఢిల్లీ పెద్దల చేతిలో పెట్టి, అదృష్ట రేఖ ఎంత వరకు అనుకూలంగా మారుతుందోనని కొండకెదురు చూసినట్టుగా గడుపుతున్నారు.
=================

జనపదం, బ్యూరో

అయిపాయె.. యాడాది కాలం చూస్తుంటేనే గడిచిపోవట్టే. చూస్తూ మురిసిపోవాల్సిందే తప్ప, చేసేదేమీ లేక కాలం నెట్టుకురావాల్సి వచ్చే. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం., అప్పటి అధికార పక్షం పూచికపుల్లగా తీసేసినా పార్టీనే పట్టుకుని వేలాడినం., నమ్ముకుని ఉన్నవారిని కాపాడుకున్నాం. ఎలాగోలా నమ్ముకున్న పార్టీకి అధికారం దక్కింది. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేం మన పంట పండింది. మనకు మంచిరోజులు వచ్చాయి. పదేళ్ల పీడ విరగడ కాబోతున్నది అని ఎగిరి గంతేసిన వారంతా గుంతలో పడి గిలగిలా కొట్టుకోవాల్సిన దుస్థితి. పెద్దలెప్పటికి కరుణిస్తారో., పదవులు ఎప్పటికి తెగుతాయో., తమనెప్పుడు ఆ పీఠం వరిస్తుందో.. అని పిట్టకు పెట్టినట్టుగా చూస్తూ గడుపుతున్నారు.

హస్తినాలో అదృష్ట రేఖ..?!
రాష్ట్రంలోని పలువురు సీనియర్లతో పాటు పార్టీకి విస్తృతంగా సేవ చేసిన కాంగ్రెస్ నేతల అదృష్టం రేఖను హస్తినాలోని పెద్దలే డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. పది నెలలుగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల్లో ఇగనైనా పదవి రాకపోతుందా.. అని ఆశగా కాలం వెల్లదీస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్నామని, ఏదో ఒకటి దక్కకపోతే తమ పని ఇక అంతే అనే వారు లేకపోలేదు. జేబుల్లోంచి చెల్లింపులు చేసి మరీ కేడర్ ను బతికించుకున్నామని, పెట్టిపెట్టి జేబులు ఖాళీ అయ్యాయని, సర్కార్ ఏర్పాటు అయిన తర్వాతనైనా తమను ఓ చూపు చూస్తేనే భవిష్యత్ బాగుంటుందనే గంపెడాశతో ఉన్నామంటున్నారు. తమ రేఖను పెద్దలు అద్భుతంగా గీసి నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందనే కఠోర నిజాన్ని కొత్త జనరేషన్ కు తెలిసేలా చేయాలని కోరుతున్నారు.

ఊరిస్తున్న నామినేటెడ్..
ఇప్పటి వరకు కేవలం కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ మాత్రమే జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రి మండలి కూర్పు కోసం కుస్తీపడుతున్న సమయంలోనే నామినేటెడ్ పదవుల పంపకం పై కూడా నిర్ణయం జరిగిపోతుందనే గంపెడాశతో ఆశవాహులు కాలం వెల్లదీశారు. మంత్రి వర్గం పొందికపై హైకమాండ్ తో పలుమార్లు మంతనాలు జరిపే కాలంలో తమకు కూడా పదవి అప్పగించేందుకు కసరత్తు జరుగుతున్నదని కలల్లో విహరించారు. కానీ, కేవలం డజన్ మంది మంత్రులతో నెట్టుకొస్తున్న సర్కార్., ఇప్పుడప్పుడే మిగతా కార్యానికి శ్రీకారం చుట్టే పరిస్థితులు కనిపించడం లేదని తీవ్ర నిరాశలోకి వెళ్లారు. అదే సమయంలో వరుసగా ఎన్నికల కాలం దాపురించడంతో తమ ఆశలు ఇప్పుడప్పుడే నెరవేరే ఘడియలు లేవని ఒక్క చిత్తానికి వచ్చారు. ఒక్కొక్కటిగా ఎన్నికలు రావడం, అయిపోవడం., అన్నీ జరుగుతున్నా ఇప్పటికీ తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిందని వాపోతున్నారు.
కొన్ని సందర్భాల్లో తమకన్నా తక్కువ అనుభవం, పార్టీతో అంతంత మాత్రంగానే అనుబంధం ఉన్నా పదవి కట్టబెట్టడంతో పలువురు సీనియర్లు ముఖం తిప్పుకుంటున్నారు. మధ్యలో వచ్చి పదవి ఎగరేసుకుని పోతున్న తీరుతో తీవ్ర కలత చెందాల్సిన పరిస్థితులు దాపురించాయని పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల పంపకం త్వరగా పూర్తి చేసి పుణ్యకాలం మొత్తంగా గడిచిపోకముందే ఎంతోకొంత అనుభవించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఇక్కడ సీఎం, మరికొందరు బాధ్యులు శ్రద్ధవహించడంతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా నాన్చే ధోరణికి స్వస్తి పలికి త్వరగా తేల్చి సంతోషాలను పూయించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు