✅ మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
✅ వరద బాధితుల సహాయార్థం భారీగా రూ.130 కోట్ల విరాళం
✅ సహాయనిధిలో జమచేసిన పత్రాలు ముఖ్యమంత్రికి అందజేత
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఈరోజు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు సతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులందరినీ అభినందించారు. “వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూలవేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక. మనస్పూర్తిగా వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే మీ ఉద్యోగ జేఏసీలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతాను” అని సీఎం తెలిపారు.
తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి రూ.130 కోట్లు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అన్నారు. ఉద్యోగులు అందరికీ మంత్రి గారు ధన్యవాదాలు తెలిపారు.