Wednesday, April 2, 2025
HomeTelanganaFarmers Struggle | ధాన్యం.. శూన్యం.. కల్లాల్లో దిగుబడి.. కొనుగోళ్ల జాడేది..?

Farmers Struggle | ధాన్యం.. శూన్యం.. కల్లాల్లో దిగుబడి.. కొనుగోళ్ల జాడేది..?

Janapadham_EPaper_TS_04-11-2024

Janapadham_TS_6 Pm_04-11-2024

*ధాన్యం.. శూన్యం..
కల్లాల్లో దిగుబడి.. కొనుగోళ్ల జాడేది..?
*
వడ్లు కొంటరా.. లేదా..?
ఇంకెప్పుడు సారూ..?
దయనీయంగా ధాన్యం రైతులు…
కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు నిల్
అకాల వర్షాలకు తడసిన వడ్లు
రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్న అన్నదాతలు
ఇంకా అలాట్ కాని మిల్లులు
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లు

ఆఖరికి పంట కూడా రాజకీయమే అయింది. పాపం అన్నదాత పగలనక, రాత్రనక కష్టం చేసి పండించిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక ఆగమయ్యే పరిస్థితి దాపురించే. అంతా సక్కగనే ఉందని అధికార పార్టీ బిల్డప్ ఇస్తుండగా, ఎక్కడ చూసినా తూట్లే తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోయేదే లేకుండా పోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పంటపండిందని సంబురపడాలో., రోడ్లపైనే రోజుల తరబడి ఎండబెట్టుకుంటూ కాపాలా పండాల్సిన దుస్థితి దాపురించిందని ఇబ్బందిపడాలో తెలియక కర్షకుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొనుగోళ్ల ఆలస్యానికి తోడు ప్రకృతి పగబట్టినట్టుగా అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నోటికి అందకుండా నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయాలో తెలియక తలపట్టుకోవాల్సిన పరిస్థితి.

=======================

జనపదం, బ్యూరో

రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు ముగింపు దశకు చేరుకున్న వరి కోతలు.. మరోవైపు వెంటాడుతున్న అకాల వర్షాలు.. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా ప్రారంభానికి నోచుకోని ధాన్యం కొనుగోళ్లు వెరసీ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేజారే పరిస్థితి దాపురించింది. పండించిన వడ్లను కొనుగోలు చేయాలని దీనంగా వేడుకుంటున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ చాలాచోట్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతన్న దిగులు చెందుతున్నాడు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,598 కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు అధికారులు చెబుతున్నా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదని తెలుస్తోంది. దీంతో కోటి ఆశలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న రైతులు అక్కడ వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలన్నీ వడ్ల కుప్పలతో నిండిపోయాయి. స్థలం లేక వడ్లను తీసుకొచ్చిన రైతులు రోడ్లపై రాశులుగా పోస్తున్నారు. దీంతో అటు రైతులకు, ఇటు వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

తడిసిన ధాన్యం..
కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడ్లు తడిసిపోయాయి. చాలాచోట్ల కోతకు వచ్చిన పంట వర్షాలతో నీళ్ల పాలైంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వడ్లు తడిశాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు కూడా నీటిపాలయ్యాయి. ఎక్కడ చూసినా వడ్లు ఎండ బెట్టుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విసిగిపోయి వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక, తెరుచుకున్న కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాక విసిగిపోయిన రైతులు వడ్లను మిల్లర్లకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల రైతులు మిల్లర్లకు తమ పంటను విక్రయిస్తున్నారు.

మద్దతు ధర గగనమే..
రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్‌కు రూ. 2320, బి- గ్రేడుకు రూ. 2300 నిర్ణయించింది. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్‌ అదనంగా ఇస్తామని చెప్పింది. కానీ, ప్రైవేటు వ్యక్తులు రైతుల ఆవేదనను, ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా చేసుకుని అన్నదాతను నిలువుగా ముంచుతున్నారు. తేమ తదితర వాటికి కొంత కోత పెట్టి వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ.1900 నుంచి రూ. 2100 వరకు కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. తాజాగా వాతావరణ శాఖ సైతం రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఒకవేళ వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షాలు కురిస్తే ప్రస్తుతం రోడ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసే ప్రమాదం లేకపోలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడం కష్టం కాగా, అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తికాని మిల్లుల అలాట్ మెంట్..
రాష్ర్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలతో మిల్లుల అనుసంధానం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో కేంద్రాల నిర్వాహకులు ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు రాకపోవడంతో చేతులెత్తేయడంతో రైతన్నలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మిల్లుల అలాట్ మెంట్ ఎప్పుడు అయ్యేది.? తమ ధాన్యం అమ్ముడు పోయేది ఎప్పుడు అంటూ రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సన్నాలకు మద్దతు..
కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించే రైతులకు క్వింటాకు కామన్‌ గ్రేడ్‌ రకానికి రూ.2,800, గ్రేడ్‌-ఏ రూ.2,820 రానుంది. రైతులు ఇచ్చిన ధాన్యానికి- కనీస మద్దతు ధర మొత్తాన్ని(ఎంఎస్పీ) పౌర సరఫరాల సంస్థ అకౌంట్ నుంచే గతంలో మాదిరి చెల్లింపులు చేస్తారు. బోనస్‌ డబ్బును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడిగా చెల్లించే అవకాశం ఉంది. రైతు భరోసా మాదిరిగా సన్నాల బోనస్‌ కూడా ఈ-కుబేర్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లుగా పౌరసరఫరాల సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, వానాకాలం సీజన్ నుంచే అమలు చేయనుంది. అన్నదాతల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ఇచ్చే బోనస్కు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సన్నాల దిగుబడి 88.09 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 48.91 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరుతాయని భావిస్తున్నారు. క్వింటా సన్నవడ్లకు రూ.500 చొప్పున బోనస్‌ రూపంలో రైతులకు రూ.2,445 కోట్ల ప్రయోజనం చేకూరనుందని పౌరసరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

వానాకాలం సాగు వివరాలు..(పట్టిక)

ధాన్యం దిగుబడి అంచనా : 1.50 కోట్ల టన్నుల
ధాన్యం కొనుగోళ్లకు అయ్యే ఖర్చు : రూ.30వేల కోట్లు
ఇప్పటి వరకు జరిగిన కేటాయింపు : రూ.20వేల కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు : 7,572
ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి : 4,598
ధాన్యం నిల్వకు ఏర్పాటు చేసిన గోదాముల సామర్థ్యం : 30లక్షల టన్నుల
రాష్ట్రంలో సన్నాల దిగుబడి అంచనా : 88.09 లక్షల టన్నులు
సన్నవడ్ల కొనుగోళ్లకు బోనస్ తో ప్రభుత్వంపై భారం : రూ.2,445 కోట్లు

RELATED ARTICLES

తాజా వార్తలు