Telangana | హైదరాబాద్ : ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మూడేండ్ల లోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు లభించింది. ఇక టెట్‌తో సంబంధం లేకుండా టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నారు.
మల్టీ జోన్ 1లో 9 నుంచి 22 వరకు, మల్టీజోన్ 2లో జూన్ 30వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. కోర్టు కేసులతో గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడ్నుంచే మళ్లీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మరో 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పదోన్నతలు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే పదోన్నతులకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి అని సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికి తోడు జీవో 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని హైకోర్టులో రంగారెడ్డి జిల్లా టీచర్లు పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే మల్టీ జోన్ -1(వరంగల్)లో గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి తప్ప.. పదోన్నతులు పూర్తి కాలేదు. వారిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. ఎస్జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి.