Janapadham_EPaper_TS_05-11-2024
ధాన్యం మురిసేలా…
కొనుగోళ్లపై సర్కార్ ఫోకస్
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం..
కేంద్రాల్లో లావాదేవీల తీరు పర్యవేక్షణ
సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశం
మాజీ మంత్రి హరీష్ ఆందోళనతో యంత్రాంగంలో చలనం..
కల్లం… చిల్లం కల్లం చేయకముందే సర్కార్ మేలుకుంది. ప్రతిపక్షం రోడ్డుపైకి వస్తామని హెచ్చరించడంతో దిద్దుబాటుకు దిగింది. కష్టం తప్ప మరేమీ తెలియని అన్నదాత ‘కొనండి మహా ప్రభో…’ అని మొరపెట్టుకుంటుంటే చెవికెక్కని ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ చేసిన హెచ్చరికతో చలనం మొదలైంది. మూసుకుపోయిన కళ్లు, పెకలని నోళ్లు తెరుచున్నాయి. కొనుగోళ్లు వేగం చేయాలని, కర్షకుడికి అమ్మకం కష్టాలు తెలియకుండా పని పూర్తి కావాలని స్వయంగా సీఎం ఆదేశాలిచ్చారు. ఆ మాటకొస్తే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ఇష్యూలైన కేంద్రాల్లో లోటుపాట్లు.., సరిపడనన్ని సెంటర్లు.., వచ్చిపోయే వానలతో ఆగమాగం.., ఆందోళనలో అన్నదాతలు.. వంటి లోపాలేమీ కనిపించకుండా పకడ్బందీగా ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని పురమాయించారు. మార్కులన్నీ ప్రభుత్వ ఖాతాలో వేసుకోవాలి తప్ప, అనవసరంగా గులాబీ అకౌంట్ లో పడకుండా చూడాలని మంత్రి వర్గ టీం అండ్ పార్టీ ప్రముఖులకు ఆయన సూచించారు.
=======================
రాష్ట్రమంతా ఒక్కటే హైరానా. ధాన్యం ఎప్పుడు కొంటారు., డబ్బులెప్పటికీ ఖాతాల్లో పడ్తాయి. అసలు పండించిన పంటను పట్టించుకునే దెవరు.? రోడ్లపైనా పడిగాపులు పడాల్సిందేనా..? కొనేదేమైనా ఉందా.., ఎట్టికి అమ్ముకుని ఇంటి ముఖం పట్టాలా.? అనే ఆందోళనకర వాతావరణానికి ముగింపు పలికేందుకు రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రతిపక్షాల యుద్ధగీతికకు జంకిందా.., లేదంటే అన్నదాతలపై నిజంగానే ప్రేమ పొంగిందా.. గానీ స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. ఉన్నఫళంగా ధాన్యం కొనుగోళ్లు, యంత్రాంగం చేపట్టిన చర్యలు., వంటి వాటిపై పూర్తి వివరాలు తెలుసుకుని కావాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
చాలీచాలని కేంద్రాలు..
రాష్ట్రంలో నత్తనడకన సాగుతోన్న ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,572 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,598 మాత్రమే ఏర్పాటు చేయడం.. ఏర్పాటు చేసిన చోట్లా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం.. కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు ఎదుర్కొంటోన్న సమస్యలు.. ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ రోడ్డెక్కుతోన్న రైతుల ఆందోళనలతో కాంగ్రెస్ సర్కార్ అప్రమత్తమైంది.
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు..
ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగేలా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల కోసం ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ అధికారులందరూ ఆయా ఉమ్మడి జిల్లాల పరిదిలోని జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. “కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?” అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించడంతో పాటు ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలన్న సీఎం క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
ప్రత్యేకాధికారులు వీరే..
కృష్ణ ఆదిత్య : ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు
ఆర్వీ కర్ణన్ : కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా ,
అనితా రామచంద్రన్ : నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట
డా. ఏ.శరత్ : నిజామాబాద్, కామారెడ్డి
డి.దివ్య : రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి
రవి : మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్
టి.వినయ కృష్ణ రెడ్డి : వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్
హరిచందన దాసరి : మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట
కె.సురేంద్ర మోహన్ : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం