TS High Court | వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అవినాశ్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దస్తగిరి వాదనలను అవినాశ్ తరఫు న్యాయవాదులు కొట్టిపడేశారు.
సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదన్నారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ని రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. మరో ఇద్దరు నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.