Thursday, April 3, 2025
HomeTelanganaTelangana High Court | హైడ్రా కమిషనర్ ను ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Telangana High Court | హైడ్రా కమిషనర్ ను ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Janapadham_2 Pm News 1.10.2024

JanaPadham_E_Paper_TS_01-10-2024

అన్ని ‘మూసీ’కొని వినండి..
అడిగిన వాటికే చెప్పండి..

హైడ్రాపై హైకోర్టులో విచారణ..
వర్చువల్ గా హాజరైన కమిషనర్ రంగనాథ్
కోర్టు కేసులో ఉన్న భవనం కూల్చివేయడమేంటని ప్రశ్న
హైడ్రా అంటేనే కూల్చుడా..? ఆదివారమే ఆ పనెందుకు..?
చార్మినార్ ను కూల్చమన్నా కూలుస్తారా..?
రంగనాథ్ కు మొట్టెకాయలు..
అమీన్ పూర్ తహసీల్దార్ వివరణపైనా అసంతృప్తి
ఇంటికెళ్లిపోవడానికి అంత ఆత్రుత ఎందుకని ఆగ్రహం..

‘‘అడిగిన వాటికి సమాధానం చెప్పండి., ఆ తర్వాత చెప్పేవన్నీ మూసుకుని వినండి. అంతేగానీ అనవసరపు విషయాలను జొప్పించొద్దు., సంబంధం లేకుండా సమాధానం చెప్పొద్దు. అయినా…….. అంతా మీరే చేస్తుంటే ఇక మేమెందుకు..? నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటుంటే వ్యవస్థలెందుకు..? కూల్చడంలో అంత ఆనందమేంటో అర్థం కావడం లేదు.., పడగొట్టడంలో పైశాచికాన్ని ఎందుకు వెతుకుతున్నారో తెలియడం లేదు. చార్మినార్ నో., హైకోర్టునో కూలగొట్టమంటే కూడా వెంటనే కానిచ్చి ఇంటికెళ్లి రిలాక్స్ అవుతారా..? మెప్పు కోసం అంత మోయాల్సిన అవసరం లేదు., తప్పు చేసి తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. చేయాల్సింది చేయండి., అతిగా స్పందించి అబాసుపాలు కావొద్దు…’’ బీ ఇన్ లిమిట్స్……
(హైడ్రా కమిషనర్ ను ఉద్దేశించి హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు.)
===================
జనపదం, బ్యూరో

చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే ముందు వెనకా ఆలోచించకుండా కూల్చేస్తారా అని రాష్ట్ర హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై మండిపడింది. అధికారులు చెప్పిన మాటలు విని పని చేస్తున్నారా..? లేక చట్టాన్ని ఫాలో అవుతున్నారా..? అని ప్రశ్నించింది. చేస్తున్నది తప్పా ఒప్పా ఆలోచించకుండా, ఏది మంచిది ఏదీ కాదు అని అవగాహన లేకుండా పని చేస్తున్నారని నిప్పులు చెరిగింది. హైడ్రా అధికారులందరినీ చంచల్ గూడలోని చర్లపల్లి జైలుకు పంపిస్తే అప్పుడు అర్ధం అవుతుంది తీవ్ర స్థాయిలో ద్వజమెత్తింది. హైడ్రాకున్న చట్టబద్ధతను మరోసారి ప్రశ్నించిన ధర్మాసనం.. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను హెచ్చరించింది.

విచారణకు స్వీకరణ..
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించిన అమీన్ పూర్ కు చెందిన పలువురు యజమానులు పిటిషన్లపై స్పందించిన హైకోర్టు వాటిపై సోమవారం విచారణ జరిపింది. వర్చువల్‌గా హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కమిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది. చట్టాన్ని ఉల్లఘించి కూల్చివేతలు చేస్తున్నారు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్టే లో ఉన్న అమీన్ పూర్ లో కట్టడాల కూల్చివేతపై ప్రశ్నించిన హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావూరి హిల్స్ లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దీంతో సీరియస్ అయిన హైకోర్టు న్యాయమూర్తి నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని, విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. తాను అడుగుతున్నది అమీన్ పూర్‌ కూల్చివేతల గురించి మాత్రమే అన్న హైకోర్టు ఆ విషయంపై మాట్లాడాలని హైడ్రా కమిషనర్‌కు చురకంటించింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ సీరియస్‌ అయ్యింది. దీంతో హైడ్రా కమిషనర్ అమీన్ పూర్‌లో కేవలం పరికరాలు మాత్రమే సమకూర్చామని హైకోర్టుకు తెలపగా ఆదివారం ఎలా పరికరాలు సమకూరుస్తారు..?ఆదివారం కూల్చడంలో మీ ఉద్దేశం ఏమిటంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

చార్మినార్, హైకోర్టును కూల్చేస్తారా..?
రేపు చార్మినార్ తహశీల్దార్‌ వచ్చి..చార్మినార్, హైకోర్టును కూల్చడానికి పరికరాలు అడుగుతారు… కూల్చేస్తారా..? అంటూ రంగనాథ్‌ను ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల పేరుతో అనాలోచితంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని హైకోర్టు హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించింది.అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామపంచాయతీ స్పందించాలనీ అదే చర్యలు తీసుకోవాలని సూచించింది.హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెడుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం ఇష్టానుసారంగా భవనాలను కూల్చేస్తే జీవో99పై స్టే ఇస్తామని హెచ్చరించింది. విధుల నిర్వహణలో ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దన్న హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్‌, అమీన్‌పూర్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని సూచించిన హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చివేస్తున్నారని మండిపడింది.

అధికారులే అతి చేస్తున్నారు..
హైడ్రా ఉద్దేశ్యం మంచిదేననీ కానీ అధికారులు వ్యవహరిస్తున్న తీరే బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమే కాదన్న ధర్మాసనం పనితీరులో ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని హితవుపలికింది. పెద్ద పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా నిజయితీగా చెప్పాలని కమిషనర్ రంగనాధ్ ను ప్రశ్నించింది. అదే సమయంలో నగరంలో పెరుగుతోన్న ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? మూసి విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించింది. ప్రస్తుతం మూసి మీద 20 పిటిషన్‌లు ఉన్నాయని అని హైకోర్టు పేర్కొంది.

కోర్టులో కేసు ఇది..
అన్ని అనుమతులు పొంది ఆస్తులు విక్రయించి అప్పులు తెచ్చి హాస్పిటల్‌ కోసం ఐదంతస్తుల భవనాన్ని నిర్మించామని భూ ఆక్రమణ చట్టం -1905 కింద 48 గంటల నోటీసు ఇచ్చి 13 గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ అమీన్ పూర్ కు చెందిన మహమ్మద్‌ రఫీ,ఎన్‌.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది.అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును తప్పుపట్టింది.ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది.ఏఅధికారం ఏ చట్టప్రకారం ఇళ్ల కూలివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగా జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేట్‌ పంచాయతీ శ్రీకృష్ణనగర్‌ ప్లాట్‌ నెంబర్‌ 92 సర్వే నంబరు 165, 166 లో ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7.30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది.ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. కమిషనర్‌ రంగనాథ్‌ అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ ప్రత్యక్షంగా గానీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు